కొన‌సాగుతున్న కేఎల్ రాహుల్ పేల‌వ ప్ర‌ద‌ర్శన‌.. అత్యంత చెత్త‌గా క్లీన్‌బౌల్డ్ అయిన స్టార్ బ్యాట‌ర్‌.. ఇదిగో వీడియో!

  • మెల్‌బోర్న్ వేదిక‌గా ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏ టెస్ట్‌ మ్యాచ్‌
  • రెండు ఇన్నింగ్స్‌ల‌లోనూ ఘోరంగా విఫ‌ల‌మైన కేఎల్ రాహుల్‌
  • మొద‌టి ఇన్నింగ్స్‌లో 4 ర‌న్స్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 10 ప‌రుగులు
  • రెండో ఇన్నింగ్స్‌లో ఊహించ‌నిరీతిలో ఔటైన స్టార్ బ్యాట‌ర్‌
టీమిండియా స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. ఇటీవ‌ల స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో మొద‌టి మ్యాచ్ త‌ర్వాత బెంచ్‌కే ప‌రిమిత‌మైన రాహుల్‌... ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఇండియా-ఏ త‌ర‌ఫున ఆడుతున్నాడు. 

దీనిలో భాగంగా మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియా-ఏపై బ‌రిలోకి దిగిన ఈ స్టార్ ప్లేయ‌ర్ రెండు ఇన్నింగ్స్‌ల‌లో కూడా త‌క్కువ స్కోర్‌కే పెవిలియ‌న్ చేరాడు. మొద‌టి ఇన్నింగ్స్ లో కేవ‌లం 4 ప‌రుగులే చేసిన అత‌డు... రెండో ఇన్నింగ్స్ లో 44 బంతులు ఎదుర్కొని 10 ర‌న్స్‌కే ఔట‌య్యాడు. అది కూడా అత్యంత చెత్త‌గా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 

ఆసీస్‌ స్పిన్న‌ర్ రొచిసియోలి బౌలింగ్‌లో రాహుల్ నిష్క్ర‌మించిన తీరు చూస్తే ఆశ్చ‌ర్యం వేయ‌క‌మాన‌దు. రొచిసియోలి వేసిన బంతి రాహుల్ ప్యాడ్స్‌పైకి వ‌చ్చింది. అయితే, బంతి లెగ్ సైడ్ వెళ్తున్న‌ట్టుగా భావించిన రాహుల్ దాన్ని ఆడ‌లేదు. దాంతో ప్యాడ్స్‌కు త‌గిలిన ఆ బంతి.. ఆ త‌ర్వాత కాళ్ల మ‌ధ్యలోంచి వెళ్లి ఆఫ్ వికెట్‌ను గిరాటేసింది. 

దీంతో అనూహ్య రీతిలో రాహుల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీని తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో భార‌త్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 161 ప‌రుగుల‌కే ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా-ఏ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 ర‌న్స్‌కు ఆలౌటైంది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 60 ప‌రుగుల‌కే కీల‌క‌మైన‌ 5 వికెట్లు కోల్పోయింది. 


More Telugu News