ఓవైపు బేకరీల్లో పని... మరోవైపు డ్రగ్స్ దందా... కొంపల్లిలో యువకుడి అరెస్ట్

  • ముంబై నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయం
  • సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ నెట్ వర్క్
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
బేకరీలలో పనిచేస్తూ ఈజీ మనీ కోసం డ్రగ్స్ దందా నడిపిస్తున్న ఓ యువకుడిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద డ్రగ్స్ కొనేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురిని పేట్ బషీరాబాద్ పోలీసులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి రూ. 4 లక్షల 40 వేల విలువైన 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటుగా నాలుగు మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

ఈమేరకు శుక్రవారం ఉదయం మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం ఉంటే 7091105423 లేదా 9490617444 నెంబర్లకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

గుజరాత్ లోని భావ్ నగర్ కు చెందిన గులాని ఆసిఫ్ హైదరాబాద్, కొంపల్లి పరిధిలోని బేకరీలలో పనిచేస్తున్నాడు. ఈ పని ద్వారా వచ్చే సొమ్ము తన జల్సాలకు సరిపోకపోవడంతో కొత్త దందాకు తెరలేపాడు. 

ముంబైలో ఉండే అలీ అనే వ్యక్తి నుంచి ఎండీఎంఏ, డ్రై గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చేవాడు. సోషల్ మీడియాలో నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని సిటీలో అమ్ముతున్నాడు. 

దీనిపై సమాచారం అందడంతో పేట్ బషీరాబాద్, మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. శుక్రవారం కొంపల్లి లో తరుణ్ వ్యాస్, మహమ్మద్ ఇక్బాల్, సుశాంత్ కుమార్ రెడ్డిలకు డ్రగ్స్ అమ్ముతుండగా ఆసిఫ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.


More Telugu News