అలీగ‌ఢ్ యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా.. సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

  • 4:3 మెజారిటీతో యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా ఉండాలంటూ ధ‌ర్మాసనం తీర్పు
  • వ్య‌తిరేకించిన‌ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, దీపాంక‌ర్ ద‌త్త, స‌తీశ్ చంద్ర శ‌ర్మ‌లు
  • 2005లో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన‌ సుప్రీంకోర్టు 
అలీగ‌ఢ్‌ ముస్లిం యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా క‌ల్పించే కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా ఇవ్వ‌డాన్ని నిరాక‌రిస్తూ 2005లో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 4:3 మెజారిటీతో యూనివ‌ర్సిటీ మైనారిటీ హోదా ఉండాలంటూ ధ‌ర్మాసనం తీర్పును వెల్ల‌డించింది. 

సీజేఐ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఏడుగురు స‌భ్యుల‌తో కూడిన‌ ధ‌ర్మాస‌నంలో.. త‌న‌తో పాటు జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, జేబీ పార్దివాలా, మ‌నోజ్ మిశ్రా యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా ఉండాల‌ని తీర్పునిచ్చింది. జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, దీపాంక‌ర్ ద‌త్త, స‌తీశ్ చంద్ర శ‌ర్మ‌లు వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చిన‌ట్లు జ‌స్టిస్ చంద్ర‌చూడ్ పేర్కొన్నారు.

విద్యా సంస్థ నియంత్ర‌ణ‌, ప‌రిపాల‌న విష‌యంలో పార్ల‌మెంట్‌లో చ‌ట్టం చేసినా.. ఆ విద్యాసంస్థ‌కు ఉన్న మైనార్టీ హోదాను ర‌ద్దు చేయ‌ర‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తెలిపింది. అడ్మినిస్ట్రేష‌న్‌లో మైనార్టీ స‌భ్యులు లేనంత మాత్రాన‌.. ఆ వ‌ర్సిటీ మైనార్టీ హోదా పోదు అని సుప్రీంకోర్టు తెలిపింది. పార్ల‌మెంట్ చ‌ట్టంతో అలీగ‌ఢ్ ముస్లిం వ‌ర్సిటీ మైనార్టీ హోదా ర‌ద్దు అయిన‌ట్లు 1968లో ఇచ్చిన తీర్పుతో పాటు 2005లో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టివేసినట్టు సీజే చంద్ర‌చూడ్ తెలిపారు. 


More Telugu News