చెరువు కబ్జా నోటీసుల వెనక రాజకీయం.. మండిపడ్డ కేతిరెడ్డి

  • హైకోర్టులో కేసు విచారణలో ఉందని వెల్లడి
  • కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేస్తానని వివరించిన మాజీ ఎమ్మెల్యే
  • ప్రభుత్వం మారిన నాటి నుంచి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ
ధర్మవరం పట్టణంలోని చిక్కవడియార్ చెరువును ఆక్రమించారని అధికారులు పంపిన నోటీసులపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాజాగా స్పందించారు. తన కుటుంబ సభ్యుల భూములకు సంబంధించి అన్ని అంశాల్లోనూ క్లియర్ గా ఉన్నట్లు తెలిపారు. నీటి పారుదల శాఖ పంపిన నోటీసుల వెనక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. ఈ భూములకు సంబంధించిన అంశంపై హైకోర్టులో కేసు విచారణ జరుగుతోందని గుర్తుచేశారు. ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుంటే అధికారులు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు కేతిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నాటి నుంచి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు ఇలా చేస్తున్నారని చెప్పారు.

నోటీసులు ఎందుకు పంపారంటే..
శ్రీసత్యసాయి జిల్లాలోని చిక్కవడియార్‌ చెరువును కేతిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని అధికారులు ఆరోపించారు. చెరువుకు సమీపంలో కొంత భూమి కొని దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించారని పేర్కొన్నారు. ఈ భూములు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతి పేరుతో ఉన్నాయని చెప్పారు. దీంతో ఆక్రమించిన భూమిని ఏడు రోజుల్లోగా ఖాళీ చేయాలని, లేదంటే అక్కడున్న నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అధికారులు నోటీసులు జారీ చేశారు.


More Telugu News