సోదాల పేరుతో మహిళలు ఉన్న గదుల్లోకి వెళ్ళడం తప్పు: ప్రియాంక గాంధీ

  • ఎన్నికల నేపథ్యంలో పాలక్కాడ్ హోటల్లో ఉంటున్న మహిళా కాంగ్రెస్ నేతలు
  • హోటల్‌లోకి బ్యాగుతో వెళ్లిన కార్యకర్త... నల్లధనంగా అనుమానం
  • హోటల్ గదిలోకి వెళ్లి సోదాలు నిర్వహించిన పోలీసులు
సోదాల పేరుతో పార్టీకి చెందిన మహిళా నేతలు ఉన్న గదుల్లోకి పోలీసులు ప్రవేశించడం సరికాదని ఏఐసీసీ అగ్రనాయకురాలు, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రియాంక గాంధీ అన్నారు. కేరళలోని వయనాడ్, పాలక్కాడ్ నియోజకవర్గాల్లో మరికొన్ని రోజుల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. దీంతో పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు పాలక్కాడ్‌లో ఉంటున్నారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త బ్యాగ్‌తో లోనికి వెళ్లారు.

ఇది సీసీటీవీలో రికార్డ్ అయింది. నల్లధనాన్ని తీసుకువెళుతున్నారనే అనుమానాలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ కేరళ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు హోటల్‌కు వెళ్లి... సోదాలు నిర్వహించారు.

ఈ ఘటనపై ప్రియాంక గాంధీ స్పందించారు. సోదాల పేరుతో అర్ధరాత్రి సమయంలో మహిళలు ఉన్న గదుల్లోకి పోలీసులు వెళ్లడం తప్పు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు, హోటల్ నుంచి నల్లధనం తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది.


More Telugu News