రేవంత్ రెడ్డి వాస్తు పిచ్చితో సచివాలయంలో మార్పులు చేస్తున్నారు: హరీశ్ రావు

  • గ్రీన్ టెక్నాలజీతో, ఫైర్ సేఫ్టీ నిబంధనలతో సచివాలయాన్ని నిర్మించామన్న హరీశ్ రావు
  • ఆధునిక టెక్నాలజీతో తాము సచివాలయం నిర్మిస్తే వాస్తు పిచ్చి అని విమర్శించారని మండిపాటు
  • రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పూటకో మార్పు చేస్తున్నాడని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తు పిచ్చితో సచివాలయంలో మార్పులు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు 'సచివాలయంలో వాస్తు మార్పులు' అంటూ వచ్చిన పత్రికా కథనాన్ని ట్వీట్ కు జోడించారు. గ్రీన్ టెక్నాలజీతో, ఫైర్ సేఫ్టీ నిబంధనలతో బీఆర్ఎస్ హయాంలో సచివాలయాన్ని నిర్మించినట్లు చెప్పారు.

దేశానికి తలమానికమైన కొత్త సచివాలయాన్ని తాము నిర్మిస్తే... వాస్తు పిచ్చి అంటూ ఆరోజు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సచివాలయానికి పూటకో మార్పు చేస్తున్నాడని విమర్శించారు. వాస్తు దోషం పేరుతో ఒక్క గేటును మార్చడానికి రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇది కదా అసలు సిసలైన కాంగ్రెస్ మార్క్ 'మార్పు' అని ఎద్దేవా చేశారు.


More Telugu News