కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలా తీశాయి: కిషన్ రెడ్డి

  • కాంగ్రెస్ పాలనపై 11 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వ్యాఖ్య
  • బీజేపీకి సంస్థాగత ఎన్నికల వ్యవస్థనే ఊపిరి అన్న కిషన్ రెడ్డి
  • ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీశాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై 11 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందన్నారు. సికింద్రాబాద్‌లో జరిగిన సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బీజేపీకి సంస్థాగత ఎన్నికల వ్యవస్థ ఊపిరి అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు, యువత, రైతుల సమస్యలపై బీజేపీ పోరాటం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లయిందన్నారు. ఏడాది పాలన పూర్తి కావొస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఓ వైపు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలపై పోరాడాలన్నారు.

దేశంలో జమ్ముకశ్మీర్ నుంచి తమిళనాడు వరకు దాదాపు అన్ని పార్టీల్లోనూ కుటుంబ పాలన సాగుతోందన్నారు. కానీ బీజేపీలో మాత్రం కార్యకర్తల నుంచి ఉన్నతస్థాయి వరకు పదవులు దక్కుతాయన్నారు. కేసీఆర్ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పులు అయితే... కాంగ్రెస్ పాలనలోనూ అదే కొనసాగుతోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో తీర్పును ఇచ్చారని వెల్లడించారు.


More Telugu News