నేను గెలిస్తే బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు చేస్తా.. మహారాష్ట్ర ఎన్సీపీ నేత హామీ.. వీడియో ఇదిగో!

  • పార్లిలో నిర్వహించిన ర్యాలీలో రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ హామీ
  • ఉద్యోగాలు లేకపోవడంతో పార్లిలోని బ్రహ్మచారులకు పెళ్లిళ్లు కావడం లేదని ఆవేదన
  • పరిశ్రమల స్థాపన, ఉద్యోగ కల్పనను మంత్రి ధనంజయ్ ముండే గాలికొదిలేశారని ఆగ్రహం
  • అలాంటి హామీ ఇవ్వడంలో తప్పులేదన్న ఎన్సీపీ అధికార ప్రతినిధి
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలు ఇవ్వడం మామూలు విషయమే. అయితే, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఇప్పుడు వైరల్ అవుతోంది. బీడ్ జిల్లాలోని పార్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే పార్లిలోని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు జరిపించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మంగళవారం సాయంత్రం పార్లిలో నిర్వహించిన ర్యాలీలో రాజేసాహెబ్ మాట్లాడుతూ.. పార్లీ అబ్బాయిలకు ఉద్యోగాలున్నాయా? లేదంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? అని పెళ్లికి ముందు పెద్దలు ఆరా తీస్తున్నారని, ప్రభుత్వం ఇవ్వకుంటే ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గార్డియన్ మంత్రి ధనంజయ్ ముండే పరిశ్రమలు స్థాపన, ఉద్యోగ కల్పనను పట్టించుకోకుంటే  బ్యాచిలర్లు ఏం చేస్తారని ప్రశ్నించారు. తాను గెలిస్తే వారందరికీ పెళ్లిళ్లు జరిపించి, బతికేందుకు ఆసరా చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజేసాహెబ్ హామీపై ఎన్సీపీ (ఎస్‌సీపీ) అధికార ప్రతినిధి అంకుష్ కాక్డే మాట్లాడుతూ.. మరాఠ్వాడాలో యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని, గత దశాబ్దకాలంగా ఇక్కడ ఉద్యోగం అన్న మాటే లేదని పేర్కొన్నారు. మరాఠ్వాడాను అభివృద్ధి చేశామని బీజేపీ, దాని మిత్రపక్షాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటిదేమీ లేదని విమర్శించారు. ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేకపోవడం సామాజిక సమస్యగా మారిందని పేర్కొన్నారు. కాబట్టి యువతకు పెళ్లిళ్లు జరిపిస్తామని ఎవరైనా హామీ ఇస్తే అందులో తప్పేమీ లేదన్నారు.


More Telugu News