ఆస్ట్రేలియా కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు... హాజరైన ఎంపీ పురందేశ్వరి

  • కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మహిళల రాజకీయరంగ ప్రవేశానికి దోహదం చేస్తున్నాయన్న పురందేశ్వరి
  • పార్లమెంటులో మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరిగిందని పేర్కొన్న పురందేశ్వరి
  • సదస్సులో అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయని వెల్లడి
మహిళా సాధికారత కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మహిళల రాజకీయరంగ ప్రవేశానికి దోహదం చేస్తున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. 73, 74 వ రాజ్యాంగ సవరణలతో స్థానిక సంస్థల స్థాయిలో కూడా మహిళలకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం వచ్చిందన్నారు. పార్లమెంటులో మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు. అయినప్పటికీ, మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

భౌగోళిక సరిహద్దులకు అతీతంగా మహిళలు తమపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల వేదికగా పోరాడడానికై మహిళలను సన్నద్ధం చేయడానికి పరస్పరం సహకరించుకుంటారని చెప్పారు. హింస అనేక విధాలుగా ఉండవచ్చు. లైంగిక దాడులు, మహిళా నాయకులను అపఖ్యాతిపాలు చేయడం, వారిపై అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించడం, వారి వారి నియోజకవర్గాల్లో వారు చేస్తున్న మంచి పనులను గుర్తించకపోవడం మొదలైనవి కూడా హింస అనే చెప్పుకోవచ్చు అని అన్నారు. తను లేవనెత్తిన ఈ నిర్దిష్ట అంశాన్ని కార్యశాలలో చర్చించిన తర్వాత ఆ వైపుగా కార్యోన్ముఖులు కావాలని నిర్ణయించడం జరిగిందని పురందేశ్వరి ట్వీట్ చేశారు.

అంతకు ముందు ఈ సదస్సులో చర్చిస్తున్న అంశాల పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) సదస్సు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సదస్సులో అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయన్నారు. కాగా, 8వ తేదీ వరకూ సదస్సులో పాల్గొని, 11న ఆమె స్వదేశానికి తిరిగి రానున్నారు. 


More Telugu News