డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ ఫోన్ కాల్‌.. చాలా గొప్ప సంభాష‌ణ జ‌రిగింద‌న్న ప్ర‌ధాని!

  • ట్రంప్‌కు ఫోన్ కాల్ చేసి అభినందించిన‌ మోదీ 
  • ఆయ‌న‌తో మ‌రోసారి క‌లిసి ప‌నిచేసేందుకు ఎదురుచూస్తున్న‌ట్లు ప్ర‌ధాని వ్యాఖ్య‌
  • భారత ప్రధాని న‌రేంద్ర మోదీ అద్భుతమైన వ్యక్తి అన్న‌ ట్రంప్
హోరాహోరీగా జ‌రిగిన‌ అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి, మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను విజ‌యం వ‌రించింది. భారీ లీడ్‌తో త‌న ప్ర‌త్య‌ర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్య‌ర్థి క‌మ‌లా హ్యారిస్‌పై ఆయ‌న గెలుపొందారు. దీంతో అమెరికా 47వ అధ్య‌క్షుడిగా ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ క్ర‌మంలో యూఎస్‌ నూత‌న అధ్యక్షుడికి ప్ర‌పంచ దేశాధినేత‌లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 

అలాగే భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ట్రంప్‌కు బుధ‌వారం ఫోన్ చేసి అభినందించారు. ఈ విష‌యాన్ని మోదీ త‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా వెల్ల‌డించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో బుధవారం జరిగిన టెలిఫోన్ సంభాషణ చాలా గొప్ప‌గా జ‌రిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్ పార్టీ అధినేతతో మరోసారి సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. 

"నా స్నేహితుడు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో గొప్ప సంభాషణ జరిగింది. ఆయ‌న అద్భుతమైన విజయానికి అభినందనలు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, ఇతర రంగాలలో ఇండియా-యూఎస్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మరోసారి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం" అని మోదీ ట్వీట్ చేశారు. 

కాగా, ప్రపంచ శాంతి కోసం కలిసి పని చేయాలనే అభిప్రాయానికి ఇరువురు నేతలు వ‌చ్చిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్రపంచం మొత్తం ప్రధాని మోదీని ప్రేమిస్తోందని, భారతదేశం అద్భుతమైన దేశమని, భారత ప్రధాని అద్భుతమైన వ్యక్తి అని ట్రంప్ అన్నారు.

భారత్‌ను నిజమైన స్నేహితునిగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీకి ట్రంప్‌ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తన విజయం తర్వాత తాను మాట్లాడిన మొదటి ప్రపంచ నాయకులలో ప్రధాని మోదీ ఒకరని ట్రంప్‌ అన్నారు.

అంతకుముందు ప్ర‌ధాని మోదీ.. అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ విజయం సాధించినందుకు అభినందిస్తూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో పోస్ట్ చేశారు. "చారిత్రాత్మక విజయం సాధించిన‌ నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు. భార‌త్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల‌ను మరింత బలోపేతం చేయడానికి కలిసి పని చేద్దాం. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి మీతో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఎదురుచూస్తున్నాను” అని యూఎస్‌ ఎన్నికలలో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ప్ర‌ధాని మోదీ పోస్ట్ చేశారు.

ఇక గత వారం ప్ర‌ధాని మోదీకి, భార‌తీయుల‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ట్రంప్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. "నా పరిపాలనలో మేము భారతదేశంతో, నా మంచి మిత్రుడు ప్రధాని మోదీతో మా గొప్ప భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాం" అని ట్రంప్‌ ట్వీట్ చేశారు. 

కాగా, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు హూస్టన్ ర్యాలీ, 'హౌడీ మోదీ' కార్యక్రమంతో పాటు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ఇద్దరు నాయకులు తమ స్నేహాన్ని ప్రదర్శించారు. ఈ కార్య‌క్ర‌మానికి దాదాపు 1,00,000 మంది ప్రజలు హాజ‌రుకావ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగానే భారత్‌లోనూ, యూఎస్‌లోనూ ప్రజలను ఆకర్షించడంలో ప్రధాని మోదీ సామర్థ్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని ట్రంప్ అన్నారు.


More Telugu News