ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్, రోహిత్‌లకు షాక్.. అదరగొట్టిన రిషబ్ పంత్

  • టాప్-10లోకి ప్రవేశించి 6వ స్థానంలో నిలిచిన పంత్
  • ఒక స్థానం దిగజారి 4వ ర్యాంకుకు పడిపోయిన యశస్వి జైస్వాల్
  • టాప్-20లోకి దిగజారిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ లేటెస్ట్ ర్యాంకులు విడుదలయ్యాయి. ఇటీవల న్యూజిలాండ్‌‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వైట్‌ వాష్‌కి గురైనప్పటికీ.. వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించిన యువ ఆటగాడు రిషబ్ పంత్ మరోసారి టాప్-10లోకి ప్రవేశించాడు. ఐదు స్థానాలు ఎగబాకి 6వ ర్యాంకులో నిలిచాడు. ఇక ఈ సిరీస్‌లో ఫర్వాలేదనిపించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానాన్ని కోల్పోయి 4వ ర్యాంకులో నిలిచాడు.

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్, న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచారు. భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టిన కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 7వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా 8వ స్థానంలో, పాకిస్థాన్‌ బ్యాటర్ షకీల్ 9వ ర్యాంకులో, ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ 10వ ర్యాంకులో నిలిచారు.

టాప్-20లోకి దిగజారిన విరాట్, రోహిత్ శర్మ...

న్యూజిలాండ్‌-భారత్ మధ్య మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో దారుణాతిదారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరి ర్యాంకింగ్స్ భారీగా దిగజారాయి. కోహ్లీ మొత్తం 8 స్థానాలు కోల్పోయి ప్రస్తుతం 22వ ర్యాంక్‌లో నిలిచాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 91 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ 2 స్థానాలు దిగజారి 26వ స్థానానికి పడిపోయాడు.

కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ చక్కగా రాణించాడు. 43.60 సగటుతో 261 పరుగులు కొట్టి భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సిరీస్‌లో కేవలం 31.66 సగటుతో 190 పరుగులే సాధించినప్పటికీ... ఈ క్యాలెండర్ ఏడాదిలో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.


More Telugu News