13 ఏళ్ల త‌ర్వాత‌ ఐపీఎల్ వేలంలోకి జేమ్స్ అండ‌ర్స‌న్‌.. సర్ఫరాజ్ ఖాన్ క‌నీస‌ ధర ఎంతంటే..!

  • ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం
  • పేరు న‌మోదు చేసుకున్న 1,574 మంది ప్లేయ‌ర్లు
  • సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షాల‌ క‌నీస ధ‌ర రూ. 75 లక్షలు
  • ఆసీస్ స్టార్ పేస‌ర్‌ మిచెల్ స్టార్క్ క‌నీస‌ ధర రూ. 2 కోట్లు
ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీలను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ మెగా వేలం జరగనుంది. ఇక ఈ వేలం కోసం మొత్తం 1,574 మంది ఆటగాళ్లు త‌మ పేర్లు న‌మోదు చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారత ఆట‌గాళ్లు ఉంటే..  409 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు. అలాగే ఈ జాబితాలో 1,224 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 320 క్యాప్డ్ ప్లేయ‌ర్లు, మ‌రో 30 మంది అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు. 

1,574 మంది ఆటగాళ్లతో కూడిన సుదీర్ఘ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ త‌న పేరు న‌మోదు చేసుకోలేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్లుగా విడుదలైన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రూ. 2 కోట్ల క‌నీస ధ‌ర‌తో జాబితాలో ఉన్న‌ట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో నివేదిక పేర్కొంది.  

రూ. 2 కోట్ల క‌నీస ధ‌ర క‌లిగిన ఇత‌ర భార‌త ఆట‌గాళ్లు
రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, వెంకటేశ్‌ అయ్యర్, అవేశ్‌ ఖాన్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్‌ యాదవ్.

సర్ఫరాజ్ ఖాన్ క‌నీస ధ‌ర రూ.75 లక్షలు
ఇక టీమిండియా యువ ఆట‌గాళ్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ క‌నీస ధ‌ర రూ.75 లక్షలు మాత్ర‌మే. ఇటీవ‌ల ముంబ‌యి రంజీ జ‌ట్టులోంచి ఉద్వాస‌న‌కు గురైన పృథ్వీ షా గ‌త సీజ‌న్ వ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ర‌ఫున ఆడాడు.

మ‌రోవైపు 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ రికార్డు ధ‌ర‌ రూ. 24.50 కోట్లకు కొనుగోలు చేసిన ఆసీస్ స్టార్ పేస‌ర్‌ మిచెల్ స్టార్క్ క‌నీస‌ ధర రూ.2 కోట్లు.

అనూహ్యంగా ఐపీఎల్ వేలంలోకి జేమ్స్ అండ‌ర్స‌న్‌
ఇంగ్లండ్ సీనియ‌ర్ పేస‌ర్ జేమ్స్ అండ‌ర్సన్ అనూహ్యంగా మెగా వేలంలో త‌న పేరును న‌మోదు చేసుకున్నాడు. రూ.1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో త‌న పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఇటీవ‌లే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఈ 42 ఏళ్ల ఆట‌గాడు చివ‌రిసారి 2011, 2012లో వేలంలో పాల్గొన‌గా ఎవ‌రూ కొనుగోలు చేయ‌లేదు. దాంతో ఆ త‌ర్వాత అండ‌ర్స‌న్ ఐపీఎల్ వైపు తొంగిచూడ‌లేదు. ఇప్పుడు 13 ఏళ్ల త‌ర్వాత ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాల‌ని చూడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. 


More Telugu News