ఎన్నికల వేళ మహారాష్ట్ర బీజేపీకి రెబల్స్ బెడద.. 40 మందిపై వేటు

  • 37 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 40 మంది నేతల బహిష్కరణ
  • ఝార్ఖండ్‌లోనూ 30 మందిపై వేటు
  • ఈ నెల 20న ఎన్నికలు
  • బరిలో 148 మంది బీజేపీ అభ్యర్థులు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. 37 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 40 మంది నేతలు, కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరించింది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ‘మహాయుతి’ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీజేపీ 148 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలిపింది. 

పార్టీ నిబంధనలను, క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై వేటు తప్పదని బీజేపీ ఇప్పటికే హెచ్చరించింది. అనుకున్నట్టే గీత దాటిన 40 మంది రెబల్స్‌ను గత రాత్రి పార్టీ నుంచి బహిష్కరించింది. రెబల్స్‌పై వేటు వేయాలన్న నేతలు, క్యాడర్ డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. వారిపై చర్యలు తీసుకోకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ ఒకరు తెలిపారు. 

బీజేపీ తన అభ్యర్థులను నిలబెట్టిన చోట మాత్రమే కాకుండా శివసేన, ఎన్సీపీ బరిలోకి దిగిన నియోజకవర్గాల్లోనూ తిరుగుబాటుదారుల బెడద ఉండడంతో అక్కడ హాని జరిగే అవకాశం ఉందని భావించి వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్టు వివరించారు. కాగా, ఝార్ఖండ్‌లోనూ మంగళవారం 30 మందిని బీజేపీ బహిష్కరించింది. 


More Telugu News