రోహిత్‌, కోహ్లీలు వీఐపీ ట్రీట్‌మెంట్ వ‌దిలేసి.. ఆ ప‌ని చేయాలి: మ‌హ్మ‌ద్ కైఫ్

  • విరాట్‌, రోహిత్‌లు దేశ‌వాళీ క్రికెట్ ఆడాల‌న్న కైఫ్‌
  • అప్పుడే సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించే అవ‌కాశం ఉంద‌ని వ్యాఖ్య‌
  • ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు ముందు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రంజీ ట్రోఫీలో ఆడాల‌ని సూచ‌న‌
ఇటీవ‌ల స్వ‌దేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా 3-0 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోవ‌డం టీమిండియాపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ముఖ్యంగా సీనియ‌ర్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో పేల‌వ‌మైన ఆట తీరుతో ఉసూరుమ‌నిపించారు. దీంతో ఈ ద్వ‌యంపై మాజీలు విరుచుకుప‌డుతున్నారు. వీరు దేశ‌వాళీ క్రికెట్ ఆడాల‌ని సూచిస్తున్నారు. 

ఈ క్ర‌మంలోనే భార‌త మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ కూడా రోహిత్, కోహ్లీలకి కీల‌క సూచ‌న చేశాడు. పెద్ద కార్లు, విమానాలు, వీఐపీ ట్రీట్‌మెంట్ వ‌దిలేసి డొమెస్టిక్ క్రికెట్ ఆడాల‌ని తెలిపాడు. అప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌లో గాడిలో ప‌డే అవ‌కాశం ఉంద‌న్నాడు. స్టార్ ప్లేయ‌ర్లు సైతం త‌ప్ప‌నిస‌రిగా రంజీ క్రికెట్ ఆడాల‌ని తాజాగా కైఫ్ త‌న సోష‌ల్ మీడియా వీడియోలో పేర్కొన్నాడు. అప్పుడు టెస్టు క్రికెట్‌లో రాణించ‌గ‌ల‌ర‌ని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే ముందు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రంజీ ట్రోఫీలో త‌మ రాష్ట్ర జ‌ట్ల‌కు విరాట్‌, రోహిత్ ప్రాతినిధ్యం వహించాల‌ని సూచించాడు. 

"ప్ర‌స్తుతం వారు ఉన్న ప‌రిస్థితుల్లో ఫామ్ అందుకోవ‌డం చాలా ముఖ్యం. గంట‌ల త‌ర‌‌బ‌డి క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్ చేయాలి. అప్పుడు ఒక ల‌య‌ను అందుకోగ‌ల‌రు. ఇక‌ సెంచ‌రీ చేస్తే వారి మాన‌సిక స్థైర్యం కూడా పెరుగుతుంది. మాన‌సికంగా వారు దృఢంగా మారుతారు. అప్పుడు త‌దుప‌రి మ్యాచుల్లో బ్యాటింగ్ చేయ‌డంపై కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. త‌ద్వారా గొప్ప ఇన్నింగ్స్ ఆడే అవ‌కాశం ఉంటుంది" అని కైఫ్ తెలిపాడు.  

ఈ సంద‌ర్భంగా 2020 బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో యువ వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్ ఆట‌ను మ‌హ్మ‌ద్ కైఫ్ ప్ర‌త్యేకంగా గుర్తు చేశాడు. అక్క‌డ ప్రాక్టీస్ మ్యాచుల్లో బాగా రాణించిన పంత్‌.. ఆ త‌ర్వాత టోర్నీలో ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టు చారిత్రాత్మ‌కమైన విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడ‌ని చెప్పుకొచ్చాడు. 

ఈ నేప‌థ్యంలో రోహిత్‌, కోహ్లీ మునుప‌టి ఫామ్‌ను అందుకోవాలంటే వీఐపీ క‌ల్చ‌ర్‌ను వ‌దిలేసి, త‌ప్ప‌నిస‌రిగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల‌ని కైఫ్ సూచించాడు. అప్పుడే వారి టెస్టు కెరీర్ గాడిలో ప‌డే అవ‌కాశం ఉంద‌న్నాడు. 


More Telugu News