కివీస్‌తో టెస్టు సిరీస్ ఓట‌మి ఎఫెక్ట్‌... స్వ‌దేశంలోనే కోహ్లీ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌!

  • నేడు కింగ్ కోహ్లీ 36వ బ‌ర్త్‌డే 
  • కివీస్‌తో టెస్టు సిరీస్ ఓట‌మి త‌ర్వాత స్వ‌దేశంలోనే ఉండిపోయిన కోహ్లీ
  • త‌న చైన్ రెస్టారెంట్ 'వన్8 కమ్యూన్‌'లో భార్య‌ అనుష్క శ‌ర్మతో కలిసి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌
  • ఈ మేర‌కు 'హిందుస్థాన్ టైమ్స్' క‌థ‌నం
టీమిండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ కుమారుడు అకాయ్ పుట్టిన‌ప్ప‌టి నుంచి లండ‌న్‌లో సెటిల్ అయిన విష‌యం తెలిసిందే. స్వ‌దేశంలో గానీ, విదేశాల్లో గానీ భార‌త జ‌ట్టు తాను ఆడే సిరీస్‌లు ముగియ‌డ‌మే ఆల‌స్యం వెంట‌నే లండ‌న్‌లో వాలిపోయేవాడు. కానీ, ఇటీవ‌ల స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ వైట్‌వాష్ కావ‌డంతో త‌న నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. 

నేడు కింగ్ కోహ్లీ 36వ బ‌ర్త్‌డే. సాధార‌ణంగానైతే ఈ స‌మ‌యంలో విరాట్ లండ‌న్‌లో ఉండేవాడు. కానీ, ఈసారి ఇక్క‌డే పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుపుకున్న‌ట్టు స‌మాచారం. త‌న చైన్ రెస్టారెంట్ 'వన్8 కమ్యూన్‌'లో భార్య‌ అనుష్క శ‌ర్మతో కలిసి బ‌ర్త్‌డే జరుపుకున్నాడని 'హిందుస్థాన్ టైమ్స్' క‌థ‌నం పేర్కొంది.

ఇక ఈ ఏడాది విరాట్‌కు అస‌లేమీ క‌లిసిరాలేద‌ని చెప్పాలి. టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను భారత్ గెలుచుకున్నప్పటికీ, త‌న‌ ఫామ్, వ్యక్తిగత ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా ఈ ఏడాది కోహ్లీకి బ్యాడ్ టైమ్ నడిచింది. ఈ దిగ్గజ బ్యాటర్ ఏ ఫార్మాట్‌లో ఆడినా పరుగుల కోసం కష్టపడ్డాడు. టీ20 ప్రపంచ కప్‌లో కూడా దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక్క‌ ఫైనల్‌ను మినహాయించి మిగ‌తా టోర్నీ మొత్తం నిరాశ‌ప‌రిచాడు.

న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ ఘోరంగా విఫ‌లం అయ్యాడు. ఆరు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి 100 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. ఇప్పుడు జట్టులో అతని కొనసాగింపుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విరాట్ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేసిన‌ విష‌యం తెలిసిందే. 

ఇక టెస్టుల్లో కోహ్లీ భవిత‌వ్యం త్వ‌ర‌లో ఆస్ట్రేలియాలో జ‌రిగే బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీతో తేలిపోతుంద‌ని క్రీడా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక్క‌డ కూడా ఈ ఇండియన్ 'ర‌న్‌ మెషీన్' విఫ‌లమైతే జ‌ట్టులో కొన‌సాగ‌డం క‌ష్టమ‌నేది వారి అభిప్రాయం. అటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా ఇలాంటి విమ‌ర్శ‌లే ఎదుర్కొంటున్నాడు. హిట్‌మ్యాన్ బ్యాట్ నుంచి కూడా ఈ మ‌ధ్య ప‌రుగులు రావ‌డం లేదు. దీంతో ఈ ఇద్ద‌రు స్టార్లు సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎక్కువ కాలం కొన‌సాగే అవ‌కాశం త‌క్కువ అనేది ప‌లువురు మాజీల అభిప్రాయం.


More Telugu News