ఇందిరాపార్క్ వద్దకు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్

  • హామీలు అమలు చేయాలంటూ ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహాధర్నా
  • మహాధర్నా వద్దకు ఓ ఆటోలో చేరుకున్న కేటీఆర్
  • ఆటో డ్రైవర్‌తో ముచ్చటించిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నా ప్రాంతానికి ఆయన ఆటోలో చేరుకున్నారు. కేటీఆర్ మొదట నందినగర్‌లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఆటో డ్రైవర్‌తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. ఆయన ఆటోలో కూర్చొని వెళుతుండగా కొంతమంది కార్యకర్తలు, అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి పోటీపడ్డారు.

హామీలు అమలు చేయాలని మహాధర్నా

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్లు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు.

మహాలక్ష్మి స్కీంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిని వెంటనే అమలు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. యాప్‌లతో అనుమతి లేకుండా నడుస్తున్న టూ వీలర్లను నిషేధించాలని కోరుతున్నారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News