అమెరికా ఎన్నికల్లో గెలిచేది ట్రంపేనట.. థాయ్ లాండ్ హిప్పో జోస్యం.. వీడియో ఇదిగో!

  • కమలా హ్యారిస్ తో తలపడుతున్న మాజీ ప్రెసిడెంట్
  • ఈసారి హోరాహోరీ పోరు తప్పదంటున్న విశ్లేషకులు
  • కాబోయే అధ్యక్షుడిని నిర్ణయించే స్వింగ్ స్టేట్లపై అభ్యర్థుల స్పెషల్ ఫోకస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచేది మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని థాయ్ లాండ్ కు చెందిన హిప్పోపోటమస్ జోస్యం చెప్పింది. కమల, ట్రంప్ లలో కాబోయే అధ్యక్షుడు ఎవరంటూ జూ నిర్వాహకులు పెట్టిన ఓ పరీక్షలో ట్రంప్ ను హిప్పో ఎంపిక చేసింది. థాయ్ లాండ్ జూలోని ఈ హిప్పో పేరు మూ డెంగ్.. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవల మూన్ వాక్ (మైఖెల్ జాక్సన్ ఫేమస్ డ్యాన్స్) తో మూ డెంగ్ చాలామంది అభిమానులను సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో మూ డెంగ్ జోస్యం కోసం జూ నిర్వాహకులు ప్రయత్నించారు. ఓ గుమ్మడి పండును రెండుగా కోసి ఒకదానిపై ట్రంప్ పేరును, మరో దానిపై కమల పేరును రాశారు. రెండింటినీ వివిధ పళ్లతో అలంకరించి మూ డెంగ్ ఉండే చోటుకు దగ్గర్లో పెట్టారు. కాసేపటికి అక్కడికి వచ్చిన హిప్పో.. రెండింటినీ చూసి ట్రంప్ పేరున్న గుమ్మడిపండును ఆరగించింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేది ట్రంపేనని హిప్పో జోస్యం చెప్పిందంటూ నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో కమల, ట్రంప్ ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వెల్లడించిన పలు సర్వేలు కొన్నింట్లో ట్రంప్, మరికొన్నింట్లో కమల లీడ్ లో ఉన్నట్లు వెల్లడైంది. లీడ్ లో ఎవరు ఉన్నా కూడా ఇద్దరి మధ్య తేడా చాలా స్వల్పంగా ఉండడం విశేషం. ఈ క్రమంలోనే అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించడంలో కీలకమైన స్వింగ్ స్టేట్స్ ఏడింటిపై ఇరువురు అభ్యర్థులూ ప్రత్యేకంగా దృష్టి సారించారు. తటస్థ ఓటర్లను ఆకర్శించేందుకు చివరిక్షణంలో ప్రచారం హోరెత్తించారు.


More Telugu News