అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై ట్రంప్‌, జో బైడెన్ ప్ర‌త్యేక పోస్టులు

  • ఈరోజే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు
  • ఇప్ప‌టికే ముంద‌స్తు ఓటింగ్‌లో పాల్గొన్న 7.5కోట్ల మంది అమెరిక‌న్లు
  • ఓట‌ర్ల‌ను ఉద్దేశిస్తూ ట్రంప్‌, బైడెన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు
  • ఓట‌ర్లంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఓటింగ్‌లో పాల్గొనాల‌ని పిలుపు
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ఈరోజు జరుగుతున్నాయి. సుమారు 24.5 కోట్ల మంది అమెరిక‌న్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. ఇప్ప‌టికే ముంద‌స్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల‌కు పైగా ఓట‌ర్లు ఓటు వేశారు. ఈ క్ర‌మంలో ఓట‌ర్ల‌ను ఉద్దేశిస్తూ రిప‌బ్లిక‌న్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థి, మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, అధ్య‌క్షుడు జో బైడెన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేక పోస్టులు పెట్టారు. ఓట‌ర్లంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఓటింగ్‌లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. 

ట్రంప్‌ను క‌మ‌ల‌ ఓడించ‌డం ఖాయం: జో బైడెన్‌
"మ‌రికొన్ని గంట‌ల్లో ఎన్నిక‌లు. ఈ ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్‌ను క‌మ‌లా హ్యారిస్ ఓడించ‌డం ఖాయం. అందుకు మీరంద‌రూ ఓటింగ్‌లో పాల్గొనాలి. ముంద‌స్తు ఓటింగ్‌ను వినియోగించుకోని వారంతా పోలింగ్ కేంద్రాల‌కు వెళ్లి ఓటు హ‌క్కు వినియోగించుకోండి" అని బైడెన్ పిలుపునిచ్చారు. 

అమెరికాను మ‌ళ్లీ గొప్ప‌గా తీర్చుదిద్దుకుందాం: డొనాల్డ్ ట్రంప్‌
"మ‌న దేశ చ‌రిత్ర‌లో అత్యంత ముఖ్య‌మైన రాజకీయ ఘ‌ట్టానికి చేరువ‌లో ఉన్నాం. అమెరికాను మ‌ళ్లీ గొప్ప‌గా తీర్చిదిద్దుకుందాం. దీనికోసం మీరంద‌రూ వ‌చ్చి ఓటు వేయండి. క‌మ‌లా హ్యారిస్ అధికారంలోకి వ‌స్తే ప‌శ్చిమాసియా ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతుంది. ఆమె మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని ప్రారంభిస్తార‌ని ఓట‌ర్ల‌కు తెలుసు. అందుకే ట్రంప్‌న‌కు ఓటు వేసి, శాంతిని పున‌రుద్ధ‌రించండి. దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో అతిపెద్ద‌, విస్తృత‌మైన సంకీర్ణాన్ని నిర్మిద్దాం" అని ట్రంప్ అన్నారు. 


More Telugu News