సినిమాలో నటించి తల్లి చేసిన అప్పు తీర్చిన స్టార్ హీరో

  • టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో స్థిరపడాలని అనుకున్నానని చెప్పిన హీరో సూర్య
  • సినీ రంగంలోకి అడుగుపెట్టాలని అనుకోలేదని వెల్లడి
  • అమ్మ అప్పు తీర్చడానికి వచ్చిన ఆఫర్‌కు ఒకే చెప్పి హీరోగా నటించానని వెల్లడి
ప్రముఖ సినీ నటుడు సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ 'కంగువా' త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చిత్రబృందంతో పాటు సూర్య పాల్గొని సందడి చేస్తున్నారు. అయితే సూర్య తాను ఏ రంగంలో స్థిరపడాలి అనుకున్నది, తన అభిమాన నటుడు ఎవరు? అనే విషయాలతో పాటు సినీ రంగంలోకి ఎలా ప్రవేశించాల్సి వచ్చింది అనే కారణాలను మొదటిసారి పంచుకున్నారు. 

తన తండ్రి ఆర్టిస్ట్‌గా జీవనం ప్రారంభించి నటుడుగా రాణించినప్పటికీ తాను సినీరంగంలోకి రావాలని ఆలోచన చేయలేదన్నారు. అయితే తాను చిన్నతనం నుండి కమల్ హాసన్‌ను బాగా అభిమానించేవాడినని, ఆయన సినిమాలను మొదటి రోజే చూసేవాడినని చెప్పారు. తమ బంధువులు టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో ఉండటంతో తాను కూడా వారి మాదిరిగానే అటువైపు వెళ్లాలని భావించానని, డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఓ గార్మెంట్ ఇండస్ట్రీలో చేరి దాదాపు మూడేళ్లు అందులో పని చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో కూడా తనకు సినిమా ఫీల్డ్‌లోకి రావాలని అనిపించలేదని అన్నారు. 

అయితే.. 'మా నాన్నకు తెలియకుండా మా అమ్మ తన వడ్డాణం కుదవ పెట్టి రూ.25వేలు అప్పు తీసుకుంది. నాటి ఆర్ధిక పరిస్థితుల కారణంగా తిరిగి చెల్లించలేకపోయింది. ఆ విషయం మా అమ్మ నాకు చెప్పడంతో ఏమి చేయాలా అని ఆలోచిస్తుండగా, అనుకోకుండా సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ సినిమాలో ఒక నటుడు తప్పుకోవడంతో హీరోగా నన్ను ఎంపిక చేసుకున్నారు. దాంతో ఆ సినిమాలో నటించి అప్పు చెల్లించాను' అని తెలిపారు. ఆ తర్వాత ఈ రంగంలోనే కొనసాగి అభిమానుల ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నట్లు సూర్య చెప్పుకొచ్చారు.           


More Telugu News