తెలుగువారిపై వ్యాఖ్యలు... ప్రెస్‌మీట్‌లో మరోసారి నటి కస్తూరి క్లారిటీ

  • తనను కొంతమంది టార్గెట్ చేయడం కొత్త కాదన్న కస్తూరి
  • తెలుగు వారి గురించి ఏమాత్రం తప్పుగా మాట్లాడలేదని పునరుధ్ఘాటన
  • డీఎంకే గురించి మాట్లాడుతాను కాబట్టే బురద జల్లుతున్నారని ఆగ్రహం
  • తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపానని వెల్లడి
  • పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ తీసుకున్నానన్న కస్తూరి
అవకాశం వచ్చినప్పుడల్లా కొందరు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటారని... ఇది తనకేమీ కొత్త కాదని నటి కస్తూరి అన్నారు. నిన్న నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలుగువారిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చాయి. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన కస్తూరి... ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. తాను తెలుగు వారి గురించి ఏ మాత్రం తప్పుగా మాట్లాడలేదని పునరుద్ఘాటించారు.

తనపై కొంతమంది ద్రవిడ సిద్ధాంతవాదులు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు కొత్త కాదన్నారు. డీఎంకే చెప్పే యాంటీ బ్రాహ్మిణ్... యాంటీ హిందుత్వ... యాంటీ సనాతన ఐడియాలజీపై తాము మాట్లాడుతుంటామని, అందుకే తమపై ఇలా బురద జల్లుతారన్నారు. సాధారణంగా తాను సామాజికవర్గం గురించి ఎప్పుడూ మాట్లాడనన్నారు.

తన సోదరుడు నిన్న నిర్వహించిన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యారని కస్తూరి వెల్లడించారు. అక్కడ తాను మాట్లాడిన దానిని కొంతమంది మరోరకంగా ప్రచారం చేశారని ఆరోపించారు. ఓ నటిగా తెలుగు వారంటే తనకు ఎంతో ఇష్టమని మరోసారి చెప్పారు. డీఎంకే పార్టీ ఎలా వ్యవహరిస్తుందో తెలుగు ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అప్పుడు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపాను!

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు తాను సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపానని కస్తూరి గుర్తు చేశారు. అప్పుడు కూడా తనపై కొంతమంది విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు చెప్పారు.


More Telugu News