ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన

  • పేదవారు, బహు పేదవారి కేటగిరీ కింద తొలుత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న మంత్రి
  • త్వరలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని వెల్లడి
  • రెండో విడతలో రేషన్ కార్డు ఉంటేనే ఇళ్లు ఇస్తామని స్పష్టీకరణ
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు లేకపోయినప్పటికీ పేదవారు, బహు పేదవారి కేటగిరీ కింద మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. త్వరలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందన్నారు. రెండో విడత నుంచి రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు అర్హులవుతారని వెల్లడించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామంలోనే నివాసం ఉండాలన్నారు. అప్పుడే స్థానిక పరిస్థితులపై పట్టు కలిగి ఉంటారన్నారు. సాధ్యమైనంత త్వరగా వారు పని చేస్తున్న గ్రామంలోనే ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రామ కార్యదర్శులపై ఎంపీడీవోల అజమాయిషీ ఉండాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో పెన్షన్‌కు అర్హులైన వికలాంగులను గుర్తించాలన్నారు. అనర్హులకు ఎవరికీ పెన్షన్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అర్హులకు ఎంతమందికి ఇచ్చినా ఇబ్బంది లేదని... అనర్హులకు మాత్రం ఒక్కరికీ ఇచ్చేది లేదన్నారు. రానున్న ఏడాది కాలంలో రోడ్లు, డ్రైనేజీల సమస్య తీరుతుందని హామీ ఇచ్చారు.


More Telugu News