అమెరికాలో కన్నుమూసిన మిథున్ చక్రవర్తి మొదటి భార్య

  • 1979లో నటి హెలెనా ల్యూక్ ను పెళ్లాడిన మిథున్
  • నాలుగు నెలలకే విడాకులు
  • అమెరికాలో స్థిరపడిన హెలెనా
  • హెలెనా మృతిని నిర్ధారించిన నాట్యకారిణి కల్పనా అయ్యర్ 
బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయవేత్త మిథున్ చక్రవర్తి మొదటి భార్య హెలెనా ల్యూక్ అమెరికాలో కన్నుమూశారు. ప్రముఖ నృత్యకారిణి, నటి కల్పనా అయ్యర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబరు 3న హెలెనా ల్యూక్ తుదిశ్వాస విడిచినట్టు కల్పనా అయ్యర్ నిర్ధారించారు. అయితే, ఆమె మరణానికి గల కారణం తెలియరాలేదు.

హెలెనా ల్యూక్ తో మిథున్ చక్రవర్తి వివాహ బంధం కేవలం నాలుగు నెలల పాటే కొనసాగింది. 1979లో వీరి పెళ్లి జరగ్గా, అదే ఏడాది విడిపోయారు. ఆ తర్వాత హెలెనా ల్యూక్ అమెరికా వెళ్లిపోయి, అక్కడే విమానయాన రంగంలో స్థిరపడ్డారు. 

హెలెనాతో విడిపోయిన అనంతరం మిథున్ చక్రవర్తి... 1979లోనే మరో నటి యోగితా బాలిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కలగగా, మరొకరిని దత్తత తీసుకున్నారు. 

మిథున్ మొదటి భార్య హెలెనా ల్యూక్ బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ సరసన 'మర్ద్' చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఆమె బ్రిటన్ రాణి పాత్ర పోషించారు.


More Telugu News