రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

  • సీఎం ఇచ్చిన హామీలకే విలువ లేకుండా పోయిందని విమర్శ
  • ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లయిందన్న సంజయ్
  • దక్షిణాదికి అన్యాయమంటూ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజం
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే విలువ లేకుండా పోయిందని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. అమెరికాకు చెందిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఎన్నారై నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తెలంగాణలో ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లుగా తయారయిందన్నారు. చాలా తక్కువ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. దక్షిణాదికి అన్యాయం అంటూ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. హామీల అమలులో మీడియా ప్రచారం తప్ప ప్రజలకు చేసిందైతే ఏమీ లేదన్నారు.

తెలంగాణలో మాజీ సర్పంచ్‌ల అరెస్ట్ దుర్మార్గమన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లు అప్పులపాలు కావడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆరోపించారు. అధికారంలోకి రాగానే బిల్లులు చెల్లిస్తామన్న కాంగ్రెస్... ఇప్పుడు మాట తప్పడం సరికాదన్నారు. ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్‌ల సమస్యలను పరిష్కరించకుండా పోలీసులతో అణగదొక్కాలని చూడటం దారుణమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు మాజీ సర్పంచ్‌ల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని... ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము వచ్చాక ఆదాయం కోసం కాకుండా ఆలయాల్లో ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. హిందూ ధర్మం, ప్రజల ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి కోసం తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలకు సూచించారు.


More Telugu News