అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక్క రోజు ముందు వెలువడిన తాజా సర్వే.. మొగ్గు ఎవరివైపు ఉందంటే..!

  • ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్‌కే లీడ్ ఉందంటున్న ‘అట్లాస్‌ఇంటెల్’ సర్వే
  • ఫలితాన్ని నిర్దేశించనున్న ఈ రాష్ట్రాల్లో కమలా హారీస్ 1.8 శాతం ఓట్లతో వెనుకబడ్డారని వెల్లడి
  • రేపు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
  • సెప్టెంబర్ నెల చివరి నుంచి సర్వేల్లో వెనుకబడుతున్న కమల
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. రేపు (మంగళవారం) అమెరికన్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. దీంతో ప్రపంచం దృష్టి అంతా అటువైపే ఉంది. అగ్రరాజ్యం ఎన్నికలను ఆసక్తికరంగా గమనిస్తున్న వేళ ఓటింగ్‌కు ఒక్క రోజు ముందు ఆసక్తికరమైన పోల్ సర్వే వెలువడింది. కీలకమైన స్వింగ్ రాష్ట్రాలలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు ఉందని ‘అట్లాస్‌ఇంటెల్’ తాజా పోల్ పేర్కొంది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కంటే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లీడ్‌లో ఉన్నారని తెలిపింది. ఏడు స్వింగ్ రాష్ట్రాలలో ట్రంప్‌‌కు ఆదరణ కనిపిస్తోందని విశ్లేషించింది.

రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేస్తామని 49 శాతం మంది చెప్పారని, తమ పోల్‌లో హారిస్ కంటే ట్రంప్‌కు 1.8 శాతం ఓట్ల ఆధిక్యం కనిపించిందని పోల్ సర్వే పేర్కొంది. నవంబర్ మొదటి రెండు రోజులలో ఈ సర్వే నిర్వహించామని, అమెరికాలో దాదాపు 2,500 మంది ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించామని, ఇందులో అత్యధికులు మహిళలేనని పేర్కొంది.

అధ్యక్ష ఎన్నికలల్లో ఫలితాన్ని నిర్దేశించడంలో కీలకంగా మారతాయని భావిస్తున్న స్వింగ్ రాష్ట్రాలపై పోల్ సర్వేలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ రాష్ట్రాలలో సర్వేలు డొనాల్డ్ ట్రంప్‌ వైపే మొగ్గుచూపుతున్నాయని ఇటీవలే వెలువడిన మరో సర్వే కూడా అంచనా వేసింది. కాగా స్వింగ్ రాష్ట్రాల జాబితాలో అరిజోనా, జార్జియా, మిషిగాన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఉన్నాయి. అరిజోనాలో ట్రంప్‌కు 51.9 శాతం, కమలకు 45.1 శాతం ఓట్లు పడతాయని విశ్లేషించింది.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించి విశ్లేషిస్తుంటారు. వీటిని రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్, స్వింగ్ స్టేట్స్‌గా పేర్కొంటారు. 1980 నుంచి రిపబ్లికన్లు తిరుగులేని విజయాలు సాధిస్తున్న రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అని, 1992 నుంచి డెమొక్రాట్లు ఆధిపత్యం చెలాయిస్తున్న రాష్ట్రాలను బ్లూ స్టేట్స్ అని విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఈ రాష్ట్రాల్లో ఫలితాలను ఊహించడానికి అవకాశం ఉంటుంది.

అయితే స్వింగ్ రాష్ట్రాలలో రిపబ్లికన్ పార్టీ, డెమొక్రాట్‌ పార్టీ మధ్య పోటీ చాలా దగ్గరగా ఉంటుంది. విజేతలు చాలా స్వల్ప మెజారిటీలతో గెలుస్తుంటారు. ఉదాహరణకు 2020 అధ్యక్ష ఎన్నికల్లో అరిజోనాలో జో బైడెన్ కేవలం 10,000 ఓట్లతో గెలుపొందారు. కాగా సెప్టెంబర్ చివరి నుంచి పోల్ సర్వేల్లో కమలా హారిస్ క్రమంగా వెనుకబడుతూ వస్తున్న విషయం తెలిసిందే.


More Telugu News