వక్ఫ్ సవరణ బిల్లు: చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై సర్వత్రా ఆసక్తి

  • పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ బిల్లు తీసుకురానున్న కేంద్రం
  • ఆ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దంటూ చంద్రబాబుకు ముస్లిం నేతల విజ్ఞప్తి
  • ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ
  • చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారిన తాజా పరిణామాలు!
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు తీసుకువచ్చేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో, ముస్లిం వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో, కేంద్రం తీసుకురానున్న వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలంటూ టీడీపీ ముస్లిం నేతలు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించారు. 

ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా మహ్మద్ ఫజ్లుర్ రహీమ్ ముజాదిది నేతృత్వంలో ముస్లిం నేతలు చంద్రబాబును కలిశారు.  వక్ఫ్ సవరణ బిల్లు-2024కి మద్దతు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. మరి, సొంత పార్టీకి చెందిన ముస్లిం నేతల విజ్ఞప్తి పట్ల చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకి భాగస్వామ్యపక్షంగా టీడీపీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. వక్ఫ్ బిల్లును వ్యతిరేకించడమేంటే ఎన్డీయేను వ్యతిరేకించడమే అవుతుంది. ఇదిలా ఉంటే... లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే టీడీపీ మద్దతు ఎంతో అవసరం. టీడీపీకి 16 మంది ఎంపీల బలం ఉంది.  

మరోవైపు పార్టీ ప్రయోజనాలు, రాష్ట్రంలో ముస్లింల మద్దతు... ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే వక్ఫ్ సవరణ బిల్లు చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారనుంది. చంద్రబాబును కలిసిన టీడీపీ ముస్లిం నేతలు, ఈ వక్ఫ్ సవరణ బిల్లు-2024 ముస్లిం సమాజానికి హానికరం అని పేర్కొన్నారు. అక్టోబరు 23న  చంద్రబాబును కలిసిన వారిలో రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ కూడా ఉన్నారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు తప్పుడు ప్రయోజనాలతో కూడుకున్నదని వారు చంద్రబాబుకు వివరించారు. 

ముస్లిం నేతల విజ్ఞప్తి పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమిలోని ఇతర భాగస్వాములతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. 

కాగా, ముస్లిం నేతలు చంద్రబాబును కలిసిన అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినాయకత్వం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీఎస్ అమీర్ బాబును ఢిల్లీ పంపించింది. ఢిల్లీలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ముస్లిం సంఘాల నేతలను కలిసి, వక్ఫ్ సవరణ బిల్లు పట్ల ఉన్న అభ్యంతరాలపై చర్చించాలని అమీర్ బాబుకు సూచించింది.


More Telugu News