కళ్లు చెమర్చాయి... కేకేఆర్ రిటెన్షన్‌ లిస్టులో పేరు లేకపోవడంపై స్టార్ క్రికెటర్ ఎమోషనల్

  • కోల్‌కతా జట్టుతో భావోద్వేగ బంధం ఉందన్న వెంకటేశ్ అయ్యర్
  • మెగా వేలంలో తిరిగి దక్కించుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేసిన కేకేఆర్ ప్లేయర్
  • జట్టు రిటెన్షన్ లిస్ట్ బాగుందని విశ్లేషణ
ఐపీఎల్ 2024 విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇటీవల ప్రకటించిన రిటెన్షన్ లిస్టులో తన పేరు లేకపోవడంపై ఆ జట్టు స్టార్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ ఎమోషనల్ అయ్యాడు. రిటెయిన్ జాబితాలో పేరు లేకపోవడం తన కళ్లు చెమర్చేలా చేసిందని చెప్పాడు. 2021 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకే ఆడానని గుర్తుచేసుకున్నాడు. రిటెన్షన్‌లో తన పేరు లేకపోవడంతో కన్నీళ్లు వచ్చాయని వెంకటేశ్ అయ్యర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. 

కోల్‌కతా జట్టు ఒక పరిపూర్ణ కుటుంబం లాంటిదని, తాను కేవలం ఆటగాళ్ల గురించే కాదు మేనేజ్‌మెంట్, సిబ్బంది, తెరవెనుక ఉన్న యువ ఆటగాళ్ల గురించి చెబుతున్నానని అన్నాడు. ఈ అటాచ్‌మెంట్ వెనుక చాలా భావోద్వేగం దాగి ఉంటుందని పేర్కొన్నాడు. అందుకే రిటెన్షన్‌లో పేరు లేకపోవడం కొంచెం కళ్లు చెమర్చాయని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ‘రెవ్‌స్పోర్ట్స్’తో వెంకటేశ్ అయ్యర్ మాట్లాడాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రిటెన్షన్ జాబితా బాగుందని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ విభాగంలో 14-16 ఓవర్లు, బ్యాటింగ్‌లో 5 స్థానాలు కవర్ అయ్యాయని విశ్లేషించాడు. రిటెయిన్ లిస్టులో ఉండాలని ఆశించానని చెప్పాడు. ఇక రిటెన్షన్‌లో పేరు లేకపోయినప్పటికీ వేలంలో తిరిగి కోల్‌కతా జట్టు తనను దక్కించుకుంటుందనే ఆశాభావాన్ని వెంకటేశ్ అయ్యర్ వ్యక్తం చేశాడు. 

కేకేఆర్ తనను తొలిసారి దక్కించుకున్న వేలం సమయంలో లైవ్ స్ట్రీమింగ్ లేదని, అయితే ఈసారి వేలంలో తనను కోల్‌కతా దక్కించుకుంటుందా లేదా అనే ఉత్సుకతతో చిన్నపిల్లాడిలా కూర్చొని లైవ్ స్ట్రీమింగ్ చూస్తానని చెప్పాడు.

కాగా గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకునేందుకు అవకాశం ఉండడంతో... 2024 ఐపీఎల్ ట్రోఫీని సాధించిన జట్టులోని చాలామంది ఆటగాళ్లను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రిలీజ్ చేసింది. విడుదల చేసిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్ కూడా ఉన్నారు. ఇక రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, రమణ్ దీప్ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, హర్షిత్ రాణాలను రిటెయిన్ చేసుకుంది.


More Telugu News