సోమ, మంగళవారాల్లో పిఠాపురంలో పవన్ పర్యటన.. షెడ్యూల్ ఇదిగో!

  • సొంత నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
  • అధికారులతో సమీక్ష, జనసేన నాయకులతో సమావేశం
  • సోమవారం రాత్రి చేబ్రోలులోని తన నివాసంలో బస
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమ, మంగళ వారాల్లో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 4వ తేదీ ఉదయం 11:30 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో విమానం దిగనున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గొల్లప్రోలు జిల్లా పరిషత్ స్కూలుకు చేరుకుంటారు. స్కూలులో సైన్స్ ల్యాబ్ ప్రారంభించి గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ, సూరంపేట హ్యాబిటేషన్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష జరపనున్నారు. అనంతరం జనసేన నేతలతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు చేబ్రోలులోని తన నివాసంలో పవన్ విశ్రాంతి తీసుకుంటారు. 

మధ్యాహ్నం పిఠాపురంలో ఆర్ఆర్ బీహెచ్ఆర్ డిగ్రీ కాలేజీ, బాదం మాధవ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రారంభోత్సవం, టీటీడీ కల్యాణమండపం, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరమ్మతు పనులకు ఉపముఖ్యమంత్రి పవన్ శంకుస్థాపన చేస్తారు. సోమవారం రాత్రి చేబ్రోలులో బసచేస్తారు. మంగళవారం ఉదయం కొత్తపల్లి పీహెచ్ సీలోని ఔట్ పేషెంట్ విభాగానికి, యు.కొత్తపల్లి మండలంలోని పలు పాఠశాలలకు పవన్ కల్యాణ్ శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు తిరిగి చేబ్రోలుకు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు, అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్తారు.


More Telugu News