ఓటమి అంచుల్లో భారత్.. క్లీన్ స్వీప్ దిశగా కివీస్

  • 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు
  • 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • భారత్ కోల్పోయిన 5 వికెట్లలో మూడు అజాజ్ పటేల్‌కే
ఆనందం ఆవిరైంది. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా భారత జట్టు ఆపసోపాలు పడుతోంది. 29 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ముంబై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌‌ను 174 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా.. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 

స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్‌‌కు కివీస్ బౌలర్లు షాకిస్తున్నారు. పోటీలు పడి వికెట్లు తీస్తూ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత్‌ను ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నారు. 13 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్‌శర్మ (11)ను మ్యాట్ హెన్రీ పెవిలియన్ పంపగా, మరో మూడు పరుగుల తర్వాత శుభమన్‌గిల్ (1)ను అజాజ్ పటేల్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆదుకుంటాడనుకుంటే ఒకే ఒక్క పరుగు చేసి అజాజ్ బౌలింగ్‌లోనే డరిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్‌ఖాన్‌ (1)ను కూడా అజాజ్ పెవిలియన్ చేర్చాడు. 

అంతకుముందు యశస్వి జైస్వాల్ (5)ను గ్లెన్ ఫిలిప్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఫలితంగా 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్ ఓటమి అంచుల్లో నిలిచింది. ప్రస్తుతం రిషభ్ పంత్ (16), రవీంద్ర జడేజా (2) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 106 పరుగులు అవసరం కాగా, చేతిలో ఐదు వికెట్లున్నాయి.


More Telugu News