సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్న పవన్

  • సనాతన ధర్మం కోసం పార్టీలో ప్రత్యేక వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పిన పవన్
  • సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
  • మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న డిప్యూటీ సీఎం
సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేనలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, కానీ తన విశ్వాసాలపై నిలబడతానని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పార్టీలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

శనివారం ఏలూరులోని జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘దీపం-2’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పవన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. దీపం-2 పథకంలో భాగంగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అందిస్తామని తెలిపారు. ప్రతి ఏడాది 1,08,39,286 మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని వివరించారు. ఇందుకోసం ఏడాదికి రూ. 2,684 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పవన్ హెచ్చరించారు. 


More Telugu News