తిరుమల ఆలయంలో పనిచేసేందుకు హిందూయేతరులను అనుమతించొద్దు: ఆచార్య ప్రమోద్ కృష్ణం

  • తిరుమల ఆలయంలో హిందువులే పనిచేయాలన్న టీటీడీ చైర్మన్
  • బీఆర్ నాయుడు వ్యాఖ్యలను సమర్థిస్తున్నానన్న ఆచార్య ప్రమోద్
  • తిరుమల హిందువులకు మాత్రమే చెందిన క్షేత్రమని ఉద్ఘాటన
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లపై నమ్మకం లేకుండా, హిందువుల ఆచారాల పట్ల గౌరవం లేకుండా... తిరుమల వంటి ఇతర ఆలయాల్లో పనిచేయడానికి వివిధ ఏజెన్సీల తరఫున వచ్చే హిందూయేతరులకు అనుమతి ఇవ్వరాదని అన్నారు. అలాంటివారిపై నిషేధం విధించాలని స్పష్టం చేశారు. 

తిరుమల ఆలయంలో హిందువులే పనిచేయాలని ఇటీవల టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆచార్య ప్రమోద్ కృష్ణం సమర్థించారు. టీటీడీ బోర్డు చీఫ్ చేసిన వ్యాఖ్యలను తాను అంగీకరిస్తున్నానని తెలిపారు. సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. తిరుమల హిందువులకు మాత్రమే చెందిన క్షేత్రమని పేర్కొన్నారు. 

మద్యం తాగిన వ్యక్తులను మసీదుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేసేందుకు అనుమతించరని, కనీసం వారిని మసీదుల్లో అడుగు కూడా పెట్టనివ్వరని ఆచార్య ప్రమోద్ పేర్కొన్నారు. అలాగే, హిందువులకు పరమ పవిత్రమైన గోవును గౌరవించని వాళ్లను తిరుమల వంటి ఇతర ఆలయాల్లోకి ప్రవేశం కల్పించరాదని అన్నారు.


More Telugu News