ముంబయి టెస్టులో ముగిసిన రెండోరోజు ఆట... టీమిండియాదే పైచేయి

  • ముంబయిలో టీమిండియా × కివీస్
  • రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 171 పరుగులు చేసిన న్యూజిలాండ్
  • కివీస్ ఆధిక్యం 143 పరుగులు
న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయి 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ కోల్పోయిన టీమిండియా... మూడో టెస్టులో పరువు కోసం పట్టుదలగా ఆడుతోంది. ముంబయిలో కివీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తన అవకాశాలను మెరుగుపర్చుకుంటోంది. 

ఈ టెస్టు మ్యాచ్ కు నేడు రెండో రోజు కాగా... ఆట ముగిసే సమయానికి టీమిండియాదే పైచేయిగా నిలిచింది. కివీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 171 పరుగులు చేసి కష్టాల్లో కొనసాగుతోంది. కివీస్ ఆధిక్యం కేవలం 143 పరుగులే. ఆ జట్టు చేతిలో మరొక్క వికెట్ మాత్రమే ఉంది. 

టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4, అశ్విన్ 3, ఆకాశ్ దీప్ 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. కివీస్ ఇన్నింగ్స్ లో విల్ యంగ్ 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. గ్లెన్ ఫిలిప్స్ 26, ఓపెనర్ డెవాన్ కాన్వే 22, డారిల్ మిచెల్ 21 పరుగులు చేశారు. 

అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులు చేసింది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసి, 28 పరుగుల ఆధిక్యం అందుకుంది.


More Telugu News