ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి ట్వీట్... "ఇవి నిజం కాదా' అంటూ హరీశ్ రావు కౌంటర్

  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎంతో చేశామని రేవంత్ రెడ్డి ట్వీట్
  • నియామకాలు సహా అన్నీ కేసీఆర్ చేసినవేనని హరీశ్ రావు కౌంటర్
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని ఆగ్రహం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో ఎంతో చేశామని ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్‌పై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ముఖ్యమంత్రి స్పందించారు. "ఇవి నిజం కాదా" అంటూ బీఆర్ఎస్ హయాంలో ఇవి చేశామంటూ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి పలు అంశాలను పొందుపరిచారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1,61,000 నియామకాలు చేపట్టిందన్నారు. కానీ నియామకాలపై మీరు (రేవంత్ రెడ్డి, కాంగ్రెస్) అసత్య ప్రచారం చేయడం దారుణమని పేర్కొన్నారు. మీరు (సీఎంను ఉద్దేశించి) 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, కానీ వాటికి నోటిఫికేషన్లు ఇచ్చింది... పరీక్షలు నిర్వహించింది... సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది కేసీఆర్ హయాంలో అని వెల్లడించారు.

అయితే ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్ పడిన అపాయింట్‌మెంట్ ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ, తామే నియామకాలు చేపట్టినట్లు చెప్పడం విడ్డూరమన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నామని కేవలం తెలంగాణనే కాదు... యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

ఇవి నిజం కాదా?

1. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలకు కనీసం నోటిఫికేషన్లు అయినా జారీ చేశారా? వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10 శాతానికి కూడా నేటికీ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
2. 2023 డిసెంబరు 9 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ వాగ్దానం చేసిన మొత్తంలో సగం కూడా ఇవ్వలేదు. అర్హులైన రైతులలో సగానికి పైగా నేటికీ వేచి ఉన్నారు.
3. వృద్ధాప్య పెన్షన్‌ను నెలకు రూ.4,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ దాదాపు 11 నెలల గడుస్తున్నా అమలు చేయడంలో విఫలం కాలేదా?
4. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు దానిని అమలు చేయలేదనేది నిజం కాదా?
5. ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డును ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇది ఇంకా ప్రారంభం కాలేదు.
6. ప్రతి పంటకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. కానీ దానిని కేవలం ప్రీమియం వరి ధాన్యానికే పరిమితం చేసింది నిజం కాదా?
7. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు వాగ్దానం చేసిన 10 గ్రాముల బంగారం ఇంకా అమలు చేయడం లేదు కదా?
8. విద్యార్థినుల కోసం ఈవీ వాహనాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంకా కార్యరూపం దాల్చలేదు కదా?

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్... అధికారంలోకి వచ్చి 300 రోజులు దాటినా ఏమీ చేయడం లేదని హరీశ్ రావు విమర్శించారు.

పైగా, కాంగ్రెస్ ప్రభుత్వం తమ హయాంలో వచ్చిన ఈ కింది పథకాలను నిలిపివేసిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

1. రైతు బంధు, 2. దళిత బంధు, 3. బీసీ బంధు, 4. కేసీఆర్ కిట్, 5. న్యూట్రిషన్ కిట్, 6. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం,  7. బతుకమ్మ చీరలు... ఇలా ఎన్నో పథకాలను నిలిపివేసిందన్నారు.

పైగా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏదో చేశామని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.


More Telugu News