హమాస్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఇజ్రాయెల్ దాడుల్లో పొలిటికల్ చీఫ్ హతం

  • ప్రకటించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్
  • కసబ్ మృతిని ధ్రువీకరించిన హమాస్
  • అతడు తమ పొలిటికల్ చీఫ్ కాదని, లోకల్ గ్రూప్ అధికారి మాత్రమేనని స్పష్టీకరణ
హమాస్‌ను ఇజ్రాయెల్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్ యహ్యా సిన్వర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ తాజాగా ఆ సంస్థ పొలిటికల్ బ్యూరో చీఫ్‌ను కూడా హతమార్చింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. హమాస్ సీనియర్ అధికారి అయిన ఇజ్ అల్-దిన్ కసబ్‌ను వైమానిక దాడుల్లో హతమార్చినట్టు తెలిపింది. హమాస్‌ పొలిటికల్ బ్యూరోలో అతడు కీలకంగా ఉన్నట్టు పేర్కొంది. ఐడీఎఫ్ ఇంటెలిజెన్స్, ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు వివరించింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులు అమలు పరిచేందుకు అతడికి అధికారం ఉందని తెలిపింది. కసబ్ సహాయకుడు అయ్‌మన్ అయేష్ కూడా దాడుల్లో హతమైనట్టు ఐడీఎఫ్ పేర్కొంది.

హమాస్ కూడా కసబ్ మృతిని ధ్రువీకరించింది. ఆయనతోపాటు మరో అధికారి కూడా మరణించినట్టు తెలిపింది. వారు ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ దాడి చేసిందని పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ చెబుతున్నట్టు అతడు హమాస్‌లో అత్యధిక ర్యాంకులో లేడని, కసబ్ స్థానిక గ్రూపు అధికారి మాత్రమేనని వివరించింది. మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిలో 45 మంది మృతి చెందారు. 


More Telugu News