తెలంగాణలో కుటుంబ సర్వే ఎలా చేస్తారు? ఏమేం ప్రశ్నలు అడుగుతారు?.. ఇవిగో వివరాలు!

  • కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం
  • 56 ప్రధాన ప్రశ్నలతోపాటు 19 అనుబంధ ప్రశ్నలు సిద్ధం
  • షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యం
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. సర్వేకు వచ్చిన అధికారులు ఏం అడుగుతారు? మన దగ్గర ఏమేం పెట్టుకోవాలి? సర్వేకు ఎలా సిద్ధం కావాలి? అన్నదానిపై ప్రజల్లో బోల్డన్ని అపోహలు ఉన్నాయి. నిజానికి ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యం. 

సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లు 56 ప్రధాన ప్రశ్నలతోపాటు 19 అనుబంధ ప్రశ్నలు కలిసి పార్ట్-1, పార్ట్-2 కింద మొత్తం 75 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-1లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాల కింద సాధారణ, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, రాజకీయ, వలసల సమాచారం సేకరిస్తారు. అలాగే, రాజకీయ నేపథ్యం ఉన్నా ఆ వివరాలన్నీ సేకరిస్తారు. విద్య, ఉద్యోగ పరంగా రిజర్వేషన్ ప్రయోజనాలు పొందితే ఆ వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. గత ఐదేళ్ల నుంచి లబ్ధి పొందిన పథకాల గురించి ఎన్యుమరేటర్లకు చెప్పాల్సి ఉంటుంది. 

ఏమేమి పత్రాలు  దగ్గర పెట్టుకోవాలి?
అధికారులు సర్వేకు రావడానికి ముందే ఆధార్‌కార్డులు, రైతులైతే ధరణి పాస్ పుస్తకాలు దగ్గర పెట్టుకోవాలి. సర్వేకు వచ్చిన అధికారులు కుటుంబ సభ్యుల ఫొటోలు కానీ, ఎలాంటి పత్రాలు కానీ తీసుకోరు. కుటుంబ యజమాని దగ్గరుండి వివరాలు చెబితే సరిపోతుంది. ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతారు. ఇక, సాధారణ వివరాల కింద కుటుంబ యజమాని, సభ్యుల పేర్లు, వారితో సంబంధం, మతం, సామాజిక వర్గం, వయసు, మాతృభాష, ఆధార్‌కార్డు నంబర్ (మన ఇష్టం ఉంటే చెప్పొచ్చు, లేదంటే లేదు), మొబైల్ నంబర్, వైవాహిక స్థితి, దివ్యాంగులైతే వైకల్యం, ఏ మాధ్యమంలో చదువుకున్నారు? ఉద్యోగం, వార్షికాదాయం, వ్యాపారులైతే టర్నోవర్ వంటివి తెలుసుకుంటారు. అలాగే, గత ఐదేళ్లలో ఏ బ్యాంకు నుంచైనా రుణాలు తీసుకున్నారా? పశు సంపద, రేషన్ కార్డు నంబర్, స్థిర, చరాస్తి వివరాలు, నివాస గృహం, దాని విస్తీర్ణం వంటి వివరాలు సేకరిస్తారు.


More Telugu News