మహిళ ఫిర్యాదుపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పందన

  • మేరుగు నాగార్జున తన నుంచి రూ.90 లక్షలు తీసుకున్నారన్న మహిళ
  • ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకున్నాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • తన తప్పు ఉందని నిరూపిస్తే ఉరి శిక్షకైనా సిద్దమన్న మేరుగు నాగార్జున
వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై ఓ మహిళ తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తూ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన నుంచి రూ.90లక్షలు తీసుకుని మోసం చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని అడిగితే బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.

ఈ నేపథ్యంలో మహిళ ఫిర్యాదుపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. తనపై కోపం ఉంటే చంపేయండి కానీ ఇలాంటి దుష్ప్రచారం చేయవద్దని కోరారు. రాజకీయాల్లో ఎదుగుతున్న దళితుడిని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, ఈ విషయంలో తప్పు ఉందని నిరూపిస్తే, ఉరి శిక్షకు సైతం సిద్ధమని మేరుగు స్పష్టం చేశారు. 
 
మంత్రిగా ఉన్న సమయంలో తనను అనేక మంది కలిసి ఉంటారని, కానీ ఎవరితోనూ వ్యక్తిగతంగా పరిచయం లేదని తెలిపారు. తనపై లైంగిక కేసు పెట్టిన విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, తనపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. ఏ ఆధారాలతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.


More Telugu News