14 ఏళ్ల కిందట వెలిగించిన దీపం ఫలితం నేడు కనిపించింది: పవన్ కల్యాణ్

  • ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో దీపం-2 సభ
  • ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్
  • 2009 ఎన్నికలు అయిపోయాక అగమ్యగోచరంగా మారిందని వెల్లడి 
ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

2009 ఎన్నికలు అయిపోయాక తన జీవితం అగమ్యగోచరంగా అనిపించిందని, ఏంచేయాలో తెలియలేదని వ్యాఖ్యానించారు. అప్పుడు ఐఎస్ జగన్నాథపురం గ్రామానికే వచ్చానని, ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని వేడుకున్నానని పవన్ వెల్లడించారు. 

తండ్రీ... నాకు ప్రజల కోసం పనిచేసే శక్తిని ప్రసాదించమని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు. కానీ స్వామి తనకు 14 ఏళ్ల పరీక్ష పెట్టాడని... మొదటి ఎన్నికల్లో ఓడిపోయామని తెలిపారు. దాంతో భవిష్యత్ అంధకారంలా మారిపోయిందని, జీవితంలో చిమ్మచీకటి నెలకొందని పేర్కొన్నారు. 

అయితే, 14 ఏళ్ల కిందట ఇక్కడి ఆలయంలో వెలిగించిన దీపం ఫలితం ఇటీవలి ఎన్నికల్లో కనిపించిందని పవన్ వివరించారు. ఇవాళ రాష్ట్రానికే కాదు, దేశంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అండగా నిలబడే శక్తిని, ధైర్యాన్ని ప్రజలతో పాటు ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఇచ్చారని వెల్లడించారు. 


More Telugu News