ముహూరత్ ట్రేడింగ్‌లో లాభపడ్డ స్టాక్ మార్కెట్లు

  • సెన్సెక్స్ 448, నిఫ్టీ 150 పాయింట్లు ర్యాలీ
  • గ్రీన్‌లో ముగిసిన అన్ని రంగాల షేర్లు
  • నూతన సంవత్ 2081 సందర్భంగా శుక్రవారం గంటపాటు ప్రత్యేక సెషన్
దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. నూతన ‘సంవత్ 2081’ ప్రారంభ సూచకంగా ఇవాళ (శుక్రవారం) సాయంత్రం 6-7 గంటల మధ్య జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు లాభపడ్డాయి. 

బీఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు 448 పాయింట్లు  లేదా 0.56 శాతం పెరిగి 79,836.96 వద్ద ముగిసింది. గరిష్ఠంగా 80,023.75 స్థాయికి పెరిగినప్పటికీ చివరిలో లాభాలు స్వల్పంగా తగ్గాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లోనే ముగిశాయి. ఇక ఎస్‌ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 150.10 పాయింట్లు లేదా 0.62 శాతం వృద్ధి చెంది 24,355.45 స్థాయికి చేరుకుంది. సూచీలోని 50 స్టాక్స్‌లో 47 లాభాలతో ముగిశాయి.

సెన్సెక్స్‌పై అత్యధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 2.66 శాతం, అదానీ పోర్ట్స్ 1.42 శాతం, టాటా మోటార్స్ 1.35 శాతం పెరిగాయి. ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు కూడా లాభపడ్డాయి.

కాగా గురువారంతో సంవత్ 2080 ముగిసింది. ఈ ఏడాదిలో బీఎస్ఈ సెన్సెక్స్ 14,484.38 పాయింట్లు లేదా 22.31 శాతం ఎగబాకింది. ఇదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 4,780 పాయింట్లు లేదా 24.60 శాతం మేర లాభపడింది.


More Telugu News