టీ20ల నుంచి వైదొలిగిన‌ నాకు ఈ ధ‌ర‌ సరైనదే.. రిటెన్షన్ వాల్యూపై రోహిత్ శ‌ర్మ‌

  • ఐదుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకున్న ఎంఐ
  • జస్ప్రీత్ బుమ్రాకు అత్య‌ధికంగా రూ.18 కోట్లు
  • సూర్యకుమార్‌కు రూ.16.35 కోట్ల‌కు రిటైన్ చేసుకున్న జ‌ట్టు
  • మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రూ.16.30 కోట్లు మాత్ర‌మే
  • ఇలా త‌న‌కు త‌క్కువ వాల్యూ ద‌క్క‌డంపై హిట్‌మ్యాన్ స్పంద‌న‌
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అట్టిపెట్టుకునే ఆట‌గాళ్ల జాబితాను ఆయా ఫ్రాంచైజీలు గురువారం విడుదల చేశాయి. అయితే, కొన్ని ఫ్రాంచైజీలు స్టార్ ప్లేయ‌ర్ల‌ను రిటైన్ చేసుకోక‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌ధానంగా ముంబయి ఇండియన్స్ (ఎంఐ) చేసిన రిటెన్షన్ గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. తమ పర్స్ వాల్యూలోని రూ.75 కోట్లు ఖ‌ర్చు చేసి ఐదుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది.  

జస్ప్రీత్ బుమ్రాను అత్య‌ధికంగా రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అలాగే సూర్యకుమార్ (రూ.16.35 కోట్లు), హార్దిక్‌ పాండ్య (రూ.16.35 కోట్లు), మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (రూ.16.30 కోట్లు) జట్టు అట్టిపెట్టుకుంది. అలాగే యువ ఆట‌గాడు తిలక్‌ వర్మను రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది. 

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కంటే రోహిత్ శర్మను తక్కువ ధరకు రిటైన్ చేసుకోవడం పట్ల ఫ్యాన్స్ పెద‌వి విరుస్తున్నారు. ఇదే ఈ విషయమై తాజాగా హిట్‌మ్యాన్ స్పందించాడు. అయితే, అంత‌ర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తనకు ఈ వాల్యూ సరైనదే అని చెప్పుకొచ్చాడు.

''రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ తర్వాత ఈ పొజిషన్ నాకు సరైనదేనని అనుకుంటున్నా. జాతీయ జట్టుకు మంచి స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆట‌గాళ్ల‌కు ప్రాధాన్యతనివ్వాలనేది నా అభిప్రాయం. ఈ రిటెన్షన్‌ విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. గత రెండు మూడు సీజన్లలో మా ప్ర‌ద‌ర్శ‌న అనుకున్న స్థాయిలో లేదు. ఈసారి క‌చ్చితంగా మునుప‌టి ఆట‌తో క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌ని అనుకుంటున్నాం. ఐపీఎల్ 2025 కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు ఐపీఎల్ టైటిల్ గెలిచాం. రాబోయే సీజ‌న్ లో మంచి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటామ‌నే న‌మ్మ‌కం ఉంది'' అని రోహిత్ తెలిపాడు.


More Telugu News