మాకు ఎవ‌రు కావాలో బాగా తెలుసు.. వ్యూహాత్మ‌కంగానే ముందుకు వెళ్లాం: డీసీ య‌జ‌మాని పార్థ్‌ జిందాల్

  • కెప్టెన్ రిష‌బ్ పంత్‌ను విడిచిపెట్టిన డీసీ
  • అక్ష‌ర్‌, కుల్దీప్‌, ట్రిస్ట‌న్‌, అభిషేక్ పొరెల్‌ను అట్టిపెట్టుకున్న జ‌ట్టు
  • అనుభ‌వం, యంగ్ టాలెంట్‌ స‌మ్మేళ‌నంగా ముందుకు వెళ్లామ‌న్న పార్థ్ జిందాల్
  • వేలంలో త‌మ వ‌ద్ద‌ రెండు ఆర్‌టీఎం కార్డ్‌లు ఉంటాయ‌ని వ్యాఖ్య‌
  • త‌ద్వారా గ‌తంలో డీసీకి ఆడిన ప్లేయ‌ర్ల‌ను తిరిగి తీసుకునే వీలు క‌లుగుతుంద‌న్న జిందాల్‌
2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆట‌గాళ్ల జాబితాను విడుద‌ల చేశాయి. ఈ క్ర‌మంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ పంత్‌ను వేలానికి వ‌దిలేయ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఆ జ‌ట్టు న‌లుగురిని రిటైన్ చేసుకుంది. అక్ష‌ర్ ప‌టేల్ (16.50కోట్లు), కుల్దీప్ యాద‌వ్ (13.25కోట్లు), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (రూ. 10కోట్లు), అభిషేక్ పొరెల్ (రూ.4కోట్లు)ల‌ను కొన‌సాగించాల‌ని డీసీ నిర్ణ‌యించింది.  

ఈ సందర్భంగా టీమ్ ఛైర్మన్, సహ యజమాని కిరణ్ కుమార్ గ్రంధి మాట్లాడుతూ... "మా రిటెన్ష‌న్‌ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నా. మా జట్టులో మిగిలిన స్థానాల‌ను మంచి ఆట‌గాళ్ల‌తో భ‌ర్తీ చేయాల‌నే లక్ష్యంతో ఉన్నాం. ఇందులో భాగంగానే మేము బలమైన, సమతుల్యమైన స‌భ్యుల‌తో జ‌ట్టును నిర్మించాల‌ని అనుకుంటున్నాం. మెగా వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ట్రోఫీని గెలుచుకోగల సామర్థ్యం ఉన్న ఒక అద్భుతమైన జట్టును ఏర్పాటు చేయాల‌ని కోరుకుంటాయి. ఈసారి మా టార్గెట్ కూడా అదే" అని చెప్పుకొచ్చారు.  

జట్టు మ‌రో సహ యజమాని పార్థ్‌ జిందాల్ మాట్లాడుతూ.. "అక్ష‌ర్, కుల్దీప్, ట్రిస్టన్, అభిషేక్‌లతో మేము అనుభవం, యువ టాలెంట్‌ను కలిగి ఉన్నాం. మా రిటెన్ష‌న్‌ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎవ‌రిని తీసుకుంటే జ‌ట్టుకు మేలు జ‌రుగుతుందో మాకు బాగా తెలుసు. ఇక వేలానికి వెళ్లినప్పుడు మాకు రెండు ఆర్‌టీఎం కార్డ్‌లు ఉంటాయి. త‌ద్వారా మేము గతంలో డీసీకి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లను తిరిగి ద‌క్కించుకునే అవ‌కాశం ఉంటుంది. మా ఉద్దేశం మెగా వేలంలో చాలా కాలంగా ఎదురుచూసిన జట్టును రూపొందించడం. ఈసారి టైటిల్‌ను చేజిక్కించుకుని మా నగరానికి ట్రోఫీని తీసుకురావాల‌నే ల‌క్ష్యంతో ఉన్నాం" అని చెప్పారు. 

ఇక నెల ప్రారంభంలో భారత మాజీ క్రికెటర్లు హేమంగ్ బదానీ, వేణుగోపాలరావు ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్‌లో వరుసగా ప్రధాన కోచ్, క్రికెట్ డైరెక్టర్‌గా చేరిన విష‌యం తెలిసిందే.


More Telugu News