నాకున్న సమాచారం ప్రకారం... భారత జట్టు పాకిస్థాన్ లో ఆడుతుంది:  వసీమ్ అక్రమ్

  • వచ్చే ఏడాది పాకిస్థాన్ లో చాంపియన్స్ ట్రోఫీ
  • భారత్ జట్టు టోర్నీలో పాల్గొనడంపై అనిశ్చితి
  • భారత జట్టు వస్తే క్రికెట్ కు మేలు జరుగుతుందన్న అక్రమ్
వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. పాకిస్థాన్ కాకుండా మరే ఇతర దేశం ఆతిథ్యమిచ్చినా భారత్ కు పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ, గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ తో రాజకీయ సంబంధాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్న నేపథ్యంలో... చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడడంపై అనిశ్చితి నెలకొంది. పాకిస్థాన్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం టీమిండియాకు అనుమతి ఇస్తుందా, లేదా అనేదానిపై స్పష్టత లేదు. 

ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సంవత్సరం పాకిస్థాన్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీలో ఆడేందుకు భారత జట్టు గనుక పాకిస్థాన్ కు వస్తే అది ప్రపంచ క్రికెట్ కు ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు. 

ఇప్పటివరకు తనకున్న సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం, బీసీసీఐ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నట్టు తెలుస్తోందని అక్రమ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా, టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో తన మ్యాచ్ లు అన్నింటినీ లాహోర్ నగరంలోనే ఆడనుందని కూడా తనకు తెలిసిందని వెల్లడించాడు. 

బహుశా వారు మ్యాచ్ ఉన్న రోజున లాహోర్ వచ్చి, మ్యాచ్ ముగిసిన వెంటనే మళ్లీ భారత్ కు తిరిగి వెళతారని, మళ్లీ మ్యాచ్ రోజున లాహోర్ వస్తారని అనుకుంటున్నట్టు తెలిపాడు. ఈ విధానం అయితే భారత్ కు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నానని అక్రమ్ పేర్కొన్నాడు. 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి భారత ఆటగాళ్లకు పాకిస్థాన్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని వెల్లడించాడు. పాక్ లోని యువ క్రికెట్ అభిమానులు వారిని ఎంతగానో ఆరాధిస్తుంటారని వివరించాడు.


More Telugu News