రేపు ద్వారకా తిరుమలలో పవన్ పర్యటన

  • ఎన్నికల హామీల అమలుపై ఏపీ సర్కారు ఫోకస్
  • రేపటి నుంచి రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
  • ఏలూరు జిల్లాలో దీపం-2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ హాజరు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపు అమలు చేసిన చంద్రబాబు సర్కారు... ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. 

కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పర్యటించనున్నారు. ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం, ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఏపీ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 

ఏపీలో 1.55 కోట్ల మందికి దీపం-2 పథకం వర్తింపజేస్తున్నామని తెలిపారు. ఇక, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎవరూ నమ్మవద్దని మంత్రి నాదెండ్ల సూచించారు. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఉచిత గ్యాస్ కు అర్హులేనని స్పష్టం చేశారు. 

దీపం పథకం కింద సిలిండర్ బుక్ చేసుకున్న 24 గంటల్లో డెలివరీ ఇస్తారని, లబ్ధిదారుడు చెల్లించిన సొమ్ము 48 గంటల్లోనే తిరిగి వారి ఖాతాలో జమ చేస్తారని వివరించారు. దీపం-2 పథకంపై ఏవైనా సందేహాలు ఉంటే '1967' టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.


More Telugu News