కివీస్‌తో మూడో టెస్ట్‌కు టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రా దూరం!

  • ఆస్ట్రేలియా పర్యటనకు ముందు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం!
  • స్వస్థలం అహ్మదాబాద్‌కు వెళ్లిన స్టార్ పేసర్
  • జస్ప్రీత్ బుమ్రా స్థానంలో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌ను ఆడించే అవకాశం
న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది. బెంగళూరు, పూణే టెస్టుల్లో ఓడిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక ముంబై వేదికగా జరగనున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌ను గెలిచి పరువు దక్కించుకోవాలని యోచిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని పర్యాటక కివీస్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. అయితే శుక్రవారం మొదలు కానున్న ఈ ఆసక్తికర మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడబోడని తెలుస్తోంది.

మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో చేజార్చుకుంది. దీంతో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినా ఫర్వాలేదని, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడానికి ముందు అతడికి విశ్రాంతి ఇస్తే శరీర అలసట తగ్గుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడించింది. 

భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ ల టెస్ట్ సిరీస్ జరగనుందని, ఈ సిరీస్ కోసం నవంబర్ 10న భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా బయలుదేరతారని, ఆ సమయంలో జట్టుతో బుమ్రా కలుస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్ వర్గాలు చెప్పినట్టు పేర్కొంది. బుమ్రా ఇప్పటికే తన స్వస్థలం అహ్మదాబాద్‌కు వెళ్లాడని తెలిపింది. బుమ్రా అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో మరో పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే... పూణే టెస్టు మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా సరిగా రాణించలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. స్పిన్‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై స్పిన్నర్లే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశారు. కాగా ఈ మ్యాచ్‌లో ప్రదర్శన నిరాశాజనకంగా ఉండడంతో ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా బుమ్రా వెనుకబడ్డాడు. నంబర్ 1 ర్యాంకు నుంచి 3వ స్థానానికి దిగజారిన విషయం తెలిసిందే.


More Telugu News