దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి: ప్రధాని మోదీ

  • దేశ ఐక్యతను దెబ్బతీసే వారి కుట్రలను సాగనివ్వబోమన్న ప్రధాని
  • వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ పవర్ గ్రిడ్, వన్ రేషన్ కార్డు తీసుకొచ్చామని వెల్లడి
  • త్వరలో వన్ నేషన్ వన్ ఎలక్షన్, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తామన్న ప్రధాని
దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీసే వారి కుట్రలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా కేంద్రం పథకాలను అందిస్తోందని స్పష్టం చేశారు. అర్హత ఉంటే చాలు... కేంద్ర పథకాలను అందిస్తున్నామన్నారు. 

తాము అధికారంలోకి వచ్చాక వన్ నేషన్... వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానాలను తీసుకువచ్చామన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా అమలు జరిగితే ఇది దేశ వికాసానికి దోహదం చేస్తుందన్నారు.

గుజరాత్‌లోని కెవాడియాలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోదీ ఇవాళ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనదేశంలోని ఏకత్వాన్ని పటేల్ రక్షించారన్నారు. పటేల్ అనేక తరాలకు స్ఫూర్తి కలిగిస్తున్నారని పేర్కొన్నారు. దేశమంతా ఒక్కతాటిపై ఉండాలని పటేల్ ఎప్పుడూ కోరుకున్నారన్నారు. కొత్త లక్ష్యాల దిశగా భారత్ నిరంతరం ముందుకు వెళ్లాలని పటేల్ చెప్పేవారన్నారు.

మన ఉన్నతికి, వికాసానికి, ఉనికికి మూలం మాతృభాష... అందుకే స్థానిక భాషలన్నింటికీ కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఐదు భాషలకు క్లాసికల్ లాంగ్వేజెస్ హోదాను ఇచ్చామని వెల్లడించారు. ఏటా ఎన్నికల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతోందన్నారు. దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉన్నదనే ఆర్టికల్ 370ని తొలగించామన్నారు. సెక్యులర్ సివిల్ కోడ్ దిశగా మనం అడుగులు వేస్తున్నామన్నారు.

ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని అన్నారు. భారత్‌తో కలిసి నడిచేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చాయన్నారు. ఏకతా మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనం కానివ్వబోమన్నారు. ఏకతా మంత్రం వల్లే దేశ ప్రగతి చక్రాలు పరుగులు తీస్తాయన్నారు. నేడు మన దేశం చేసే ప్రతి పనిలో దేశ సమైక్యత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కశ్మీర్, ఈశాన్య భారతం రైలుతో దేశానికి కనెక్ట్ అయ్యాయన్నారు.

గత ప్రభుత్వం నీతి, నిబద్ధతల్లో వివక్ష భావాలు దేశ సమైక్యతను దెబ్బతీశాయన్నారు. గత పదేళ్లలో వివక్షను తొలగించేందుకు నిర్విరామంగా పని చేశామన్నారు. హర్ ఘర్ జల్ స్కీంతో ప్రతి ఇంటికి నీటిని అందించామని, ఆయుష్మాన్ భారత్ వల్ల ప్రతి వ్యక్తి లబ్ధి పొందుతాడన్నారు.


More Telugu News