అందుకే ఐదేళ్లుగా తిరుమ‌ల‌కు వెళ్ల‌లేదు: టీటీడీ నూత‌న‌ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

  • త‌న‌కు ద‌క్కిన గౌర‌వ‌ప్ర‌ద‌మైన‌ ప‌ద‌వి ప‌ట్ల స్పందించిన బీఆర్ నాయుడు
  • సీఎం చంద్ర‌బాబు, ఎన్‌డీఏ పెద్ద‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన టీటీడీ నూత‌న‌ ఛైర్మ‌న్
  • టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి రావ‌డం త‌న జీవితంలో కొత్త మలుపు అని వ్యాఖ్య‌
  • గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో తిరుమ‌ల‌లో అనేక అరాచ‌కాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌
  • ఐదేళ్లు తిరుమ‌ల ప‌విత్రంగా లేక‌పోవ‌డంతోనే తాను వెళ్ల‌లేద‌న్న బీఆర్ నాయుడు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూత‌న‌ ఛైర్మ‌న్‌గా బీఆర్ నాయుడు నియమితులైన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న త‌న‌కు ద‌క్కిన ఈ గౌర‌వ‌ప్ర‌ద‌మైన‌ ప‌ద‌వి ప‌ట్ల స్పందించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు, ఎన్‌డీఏ పెద్ద‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.  

టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి రావ‌డం త‌న జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నాన‌ని తెలిపారు. ఈ ప‌ద‌విని ప్రతిష్ఠాత్మ‌కంగా తీసుకుని నీతి, నిజాయితీగా ప‌నిచేస్తాన‌ని అన్నారు. అలాగే ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో తిరుమ‌ల‌లో అనేక అరాచ‌కాలు జ‌రిగాయ‌ని ఆరోపించారు. ఐదేళ్లు తిరుమ‌ల ప‌విత్రంగా లేద‌ని చెప్పారు. అందుకే ఏడాదికి ఐదారుసార్లు తిరుమ‌ల‌కు వెళ్లే తాను, ఈ ఐదేళ్లు ఒక్క‌సారి కూడా స్వామివారిని ద‌ర్శించుకోలేద‌ని తెలిపారు. ఐదేళ్లు తిరుమ‌ల‌కు వెళ్ల‌లేదంటే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. 

ఇక‌ తిరుమ‌ల‌లో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాటి గురించి గ‌తంలోనే చంద్ర‌బాబుతో చ‌ర్చించిన‌ట్లు పేర్కొన్నారు. ఛైర్మన్‌గా మ‌రోసారి సీఎంతో చ‌ర్చించి, ఆయ‌న స‌ల‌హా మేర‌కు ముందుకు వెళ్తామ‌ని బీఆర్ నాయుడు తెలిపారు. 

కాగా, టీటీడీ చైర్మన్, సభ్యులను బుధ‌వారం సాయంత్రం టీటీడీ ప్రకటించింది. 24 మంది సభ్యులతో పాలకమండలిని ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కిన సంగ‌తి తెలిసిందే.


More Telugu News