బెన్ స్టోక్స్ ఇంట్లో చోరీ.. ఆల‌స్యంగా వెలుగులోకి ఘ‌ట‌న‌.. దొంగ‌ల‌ను పట్టుకునేందుకు సాయం చేయాల‌న్న క్రికెట‌ర్‌!

  • భార్య, పిల్ల‌లు ఇంట్లో ఉండ‌గానే దోచుకెళ్లిన దుండ‌గులు
  • త‌న‌కు ఎంతో సెంటిమెంట్ అయిన వ‌స్తువులు పట్టుకెళ్లార‌ని స్టోక్స్ ఆవేద‌న‌
  • ఇటీవ‌ల స్టోక్స్‌ పాక్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలో ఘ‌ట‌న‌
ఇంగ్లండ్‌ టెస్టు క్రికెట్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్ ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగింది. ఇటీవల పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో తన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ముసుగు ధరించిన ముఠా చోరీకి పాల్పడిందని క్రికెట‌ర్ తెలిపాడు. తన కుటుంబానికి ఎటువంటి హాని జరగలేదన్నాడు. అయితే, త‌న‌కు ఎంతో సెంటిమెంట్ అయిన ప‌లు వస్తువుల‌ను దుండ‌గులు ప‌ట్టుకెళ్లార‌ని స్టోక్స్ వాపోయాడు.

"అక్టోబరు 17న‌ సాయంత్రం స‌మ‌యంలో ఈశాన్య ప్రాంతంలోని కాజిల్ ఈడెన్ ప్రాంతంలో ఉన్న నా ఇంట్లో ముసుగులు ధరించిన పలువురు దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డారు. వారు నగలు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. వాటిలో చాలా వస్తువులు నాకు, నా కుటుంబానికి బాగా సెంటిమెంట్‌తో కూడిన‌వి ఉన్నాయి. వాటిని తిరిగి భ‌ర్తీ చేయ‌డం అంత సుల‌భం కాదు" అని స్టోక్స్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. అయితే, త‌న విలువైన వ‌స్తువుల‌ను చోరీ చేసిన దొంగ‌ల‌ను గుర్తించ‌డంలో త‌న‌కు స‌హాయం చేయాల‌ని బెన్ స్టోక్స్ అభ్య‌ర్థించాడు. 

"ఈ చోరీ నా భార్య  క్లైర్, ఇద్ద‌రు చిన్న పిల్లలు లేటన్, లిబ్బి ఇంట్లో ఉన్నప్పుడు జరిగింది. అయితే, నా కుటుంబంలో ఎవరికీ ఎటువంటి హాని జరగక‌పోవ‌డం మంచిదైంది. కానీ, ఈ ఘ‌ట‌న వారి మానసిక స్థితిపై ప్రభావం చూపింది. ఇందులో నా ఫ్యామిలీకి ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగి ఉంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఆలోచిస్తేనే భ‌య‌మేస్తోంది. దొంగిలించబడిన కొన్ని వస్తువుల ఫోటోగ్రాఫ్‌లను విడుదల చేస్తున్నాను. వీటిని ఎక్క‌డ ఉన్నా సులభంగా గుర్తించవచ్చని నేను ఆశిస్తున్నాను. దీనికి బాధ్యులను మనం కనుగొనగలం అని భావిస్తున్నాను" అని స్టోక్స్ పేర్కొన్నాడు.  

ఈ విష‌యంలో త‌న‌కు సహాయం చేయాల‌నుకునేవారు పోలీసులను సంప్రదించాల‌ని స్టోక్స్ తెలిపాడు. ఇక‌ తాను స్వ‌దేశంలో లేన‌ప్పుడు త‌న ఫ్యామిలీకి చోరీ త‌ర్వాత‌ తోడ్పాటు అందించి, వారికి ధైర్యం చెప్పిన పోలీసుల‌కు బెన్ స్టోక్స్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

కాగా, ముల్తాన్ వేదిక‌గా రెండో టెస్టు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ దోపిడీ జరిగింది. ఇప్పుడు ఆల‌స్యంగా స్టోక్స్ ఈ విష‌యాన్ని ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా బ‌య‌ట‌పెట్టాడు. ఇక పాక్‌తో మూడు మ్యాచుల సిరీస్‌ను ఇంగ్లండ్  2-1 తేడాతో ఓట‌మి చ‌విచూసిన విష‌యం తెలిసిందే. 


More Telugu News