కేఎల్ రాహుల్‌ను ల‌క్నో వ‌దిలేసేది అందుకేన‌ట‌.. షాకింగ్ రిపోర్ట్‌!

  • ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్‌లను ఖరారు చేసేందుకు ఈరోజే ఆఖ‌రి గ‌డువు
  • ఎల్ఎస్‌జీ కేఎల్ రాహుల్‌ను వ‌దిలేసేందుకు రెడీ అయిందంటూ 'పీటీఐ' క‌థ‌నం
  • లీగ్‌లో గ‌త మూడేళ్లుగా రాహుల్ బ్యాటింగ్‌ స్ట్రైక్‌రేట్ బాగాలేక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని వెల్ల‌డి
ఐపీఎల్ జ‌ట్లు తాము అంటిపెట్టుకునే ఆట‌గాళ్ల జాబితాను వెల్ల‌డించేందుకు ఈరోజే ఆఖ‌రి గ‌డువు. దీంతో ప‌ది జట్లు తాము రిటైన్ చేసుకునే ప్లేయ‌ర్ల జాబితాల‌తో సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఇవాళ్టితో ఏ జట్టులో ఎంత‌మంది పాత ఆట‌గాళ్లు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌నే ఉత్కంఠ‌కు తెర‌ప‌డ‌నుంది. 

ఇదిలాఉంటే.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) త‌మ కెప్టెన్‌, స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్‌ను వ‌దిలేసేందుకు రెడీ అయిన‌ట్లు పీటీఐ క‌థ‌నం పేర్కొంది. అందుకు ఒక షాకింగ్ కార‌ణాన్ని కూడా వెల్లడించింది. గ‌డిచిన మూడేళ్లుగా టోర్నీలో రాహుల్ బ్యాటింగ్‌ స్ట్రైక్‌రేట్ బాగాలేద‌ని, అందుకే అత‌డిని వ‌దిలేస్తున్న‌ట్లు ఫ్రాంచైజీ వెల్ల‌డించిన‌ట్టు పీటీఐ క‌థనం పేర్కొంది. 

కాగా, రాహుల్ ఐపీఎల్‌ 2022కి ముందు ఎల్ఎస్‌జీలో చేరాడు. ఆ సీజన్‌లో అతని స్ట్రైక్ రేట్ 135.38. ఆ మరుసటి ఏడాది అది 113.22కి పడిపోయింది. ఇక‌ 2024లో 136.13 స్ట్రైక్ రేట్‌తో ప‌ర్వాలేద‌నిపించాడు. ఇలా లీగ్‌లో గత మూడేళ్లుగా రాహుల్ ఆమోదయోగ్యంగా లేని స్ట్రైక్ రేట్ ఫ్రాంచైజీ అత‌డిని వ‌దిలేయాల‌నే నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిందని క‌థ‌నం పేర్కొంది. 

అటు భార‌త టీ20 జ‌ట్టులోనూ రాహుల్ త‌న‌ స్థానాన్ని కోల్పోవ‌డం అత‌నికి వ్య‌తిరేకంగా మారింద‌ని తెలిపింది. రాహుల్‌కు బ‌దులుగా ప్ర‌స్తుతం భీక‌ర‌మైన ఫామ్‌లో ఉన్న క‌రేబియ‌న్ స్టార్‌ నికోలస్ పూరన్‌కు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, మెంటార్ జహీర్ ఖాన్ ప్రాధాన్యత ఇచ్చిన‌ట్టు క‌థ‌నం వెల్ల‌డించింది. 


More Telugu News