జాగ్రత్తలు చెబుతూ... దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్

  • క్రాకర్స్ జాగ్రత్తగా పేల్చాలని సూచన
  • దీపావళి అంటే దీపకాంతితో పాటు బాణసంచా ఉంటుందన్న డిప్యూటీ సీఎం
  • అజాగ్రత్తగా... నిర్లక్ష్యంగా ఉంటే కాళరాత్రిగా మారుతుందని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సకలజనులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. క్రాకర్స్ జాగ్రత్తగా పేల్చాలని కూడా సూచనలు చేశారు. ప్రజలకు పలు సూచనలు చేస్తూ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి దీపావళి... దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వుకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి ప్రతీకగా భావిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.

దీపావళి అంటే దీపాల శోభతో పాటు బాణసంచా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే జాగ్రత్తలు పాటిస్తే దీపావళి నిజంగా నయనానందకరంగా... మనస్సులో గుర్తుండి పోతుందన్నారు. కొద్దిగా అజాగ్రత్తతోనో ,... నిర్లక్ష్యంగానో టపాకాయలు పేలిస్తే అది కాళరాత్రిగా మారుతుందని హెచ్చరించారు.

ప్రతి సంవత్సరం దీపావళి పండుగ తర్వాత పలువురు బాణసంచా గాయాలతో ఆసుపత్రిపాలు కావడం మనం చూస్తూనే ఉంటామని, కాబట్టి పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనాదిగా జరుపుకుంటున్న ఈ దీపావళి అందరికీ శుభాలను కలిగించి... ఆనందం... ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు.


More Telugu News