భారత్‌లో డేటా విప్లవం ద్వారా ఏపీకి 100 బిలియన్ డాల‌ర్ల‌ పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్‌

  • ఐటీ సర్వ్ ఎలయెన్స్ సినర్జీ సమ్మిట్‌లో పాల్గొన్న‌ మంత్రి నారా లోకేశ్‌
  • ఏఐ సమర్థ వినియోగంతో పరిపాలనలో దీర్ఘకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చ‌న్న మంత్రి
  • రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూశాన‌ని వ్యాఖ్య‌
  • త‌న స్థానాన్ని ప్రజలే నిర్ణయిస్తార‌న్న లోకేశ్‌
  • ఆర్థికంగా స్థిరపడ్డాకే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలని సూచ‌న‌
దైనందిన పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. లాస్ వేగాస్ లోని ఐటీ సర్వ్ అలయెన్స్ సినర్జీ సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన లోకేశ్‌... ఫైర్ సైడ్ చాట్ లో పారిశ్రామికవేత్త రవి తొట్టెంపూడి అడిగిన ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలిచ్చారు. 23 దేశాల నుంచి 2,300 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. 

మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... 1992లో విడుదల చేసిన ఒక జీఓ కారణంగా ఇంటర్మీడియట్ లో దివ్యాంగులు కేవలం 5 సబ్జెక్టుల్లో మాత్రమే పరీక్షలు రాసే విధానం వల్ల ఇటీవల రాష్ట్రానికి చెందిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. నీట్ లో ప్రతిభ కనబర్చిన దివ్యాంగులు ఈ విషయాన్ని త‌న‌ దృష్టికి తెచ్చిన‌ట్లు తెలిపారు. వెంటనే అధికార యంత్రాంగాన్ని కదిలించి ఫ్రెష్ గా జీఓ విడుదల చేయడంతో వారికి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు లభించాయ‌న్నారు. 

అధికారులు చొరవ చూపకపోతే వారి పరిస్థితి ఏమయ్యేది? గవర్నెన్స్ లో ఇటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఏఐని వినియోగించాలని భావిస్తున్న‌ట్లు చెప్పారు. గవర్నెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్‌ తదితర రంగాల్లో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామ‌న్నారు. 

అభివృద్ధిలో ఇతర దేశాలతో పోటీపడతాం..
రానున్న రోజుల్లో భారత్ లో డేటా విప్లవం రాబోతోంది. డేటా సేవల రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు దేశంలోకి రాబోతున్నాయి. అందులో వంద బిలియన్ డాలర్లను ఏపీకి రప్పించేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఇతర రాష్ట్రాలతో కాకుండా ఇతర దేశాలతో పోటీపడతామ‌న్నారు లోకేశ్‌. సవాళ్లను అవకాశాలుగా తీసుకుని పనిచేయడం త‌మ‌కు అలవాటైంద‌ని పేర్కొన్నారు. ఇటీవల కృష్ణానదికి గత 248 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా వరదలు వచ్చాయ‌ని గుర్తు చేశారు. 

ఆ సమయంలో వ్యవసాయానికి వాడే డ్రోన్లను వరదబాధితులకు సాయం అందించేందుకు ఉపయోగించామ‌ని తెలిపారు. తమ ప్రయత్నం విజయవంతం కావడంతో డ్రోన్ల ద్వారా వివిధ రంగాల్లో సేవలు అందించడంపై దృష్టి సారించిన‌ట్లు పేర్కొన్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ లో 5 గిన్నిస్ రికార్డులు రావడం ఆనందంగా ఉంద‌న్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రత్యేక డ్రోన్ పాలసీ తెచ్చిన‌ట్లు చెప్పారు. ఏఐ వినియోగంతో పాలనా పరమైన సమస్యలను అధిగమించడానికి త్వరలో రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామ‌న్నారు. ఇది అంతర్జాతీయస్థాయి నిపుణులను తయారు చేస్తుంద‌ని తెలిపారు.  

గత అయిదేళ్లూ ఏపీకి చీకటి యుగం..
గత అయిదేళ్లూ ఏపీకి చీకటి యుగం అని మంత్రి లోకేశ్‌ అన్నారు. చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను చవి చూశార‌ని తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే ఒక చాప్టర్ సరిపోద‌న్నారు. గత అయిదేళ్లలో ఇదివరకెన్నడూ లేనివిధంగా ఆయన చీకటి జీవితాన్ని అనుభవించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చేయని తప్పుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజులు జైలుశిక్ష అనుభవించార‌ని వాపోయారు. ఇకపై కొత్త చంద్రబాబు నాయుడును ప్రజలు చూడబోతున్నార‌ని తెలిపారు. 

2014-19 మ‌ధ్య‌ ఆయన అభివృద్ధి చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలులోనే బాబు గారిని నిర్బంధించ‌డం క‌లిచివేసింద‌న్నారు. ఆనాటి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిన త‌న భార్య బ్రాహ్మణి ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా అని ప్రశ్నించిన‌ట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో హైదరాబాద్ లో నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి 45వేల మందికి పైగా హాజరుకావడంతో ఆమె తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. బ్రాహ్మణి సహకారం వల్లే తాను రాజకీయాల్లో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 226 రోజుల యువగళం పాదయాత్రలో ఆమె పూర్తి సహాయ, సహకారాలు అందించార‌ని తెలిపారు. తాను త‌న‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే సరికి ప్రతిరోజూ రాత్రి 11 గంటలు అవుతుంద‌న్నారు. రాజకీయాల్లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయక తప్పద‌ని పేర్కొన్నారు. రాజకీయాల్లో తాత ఎన్టీఆర్ లెగసీని కొనసాగించడం త‌న‌కు గర్వంగా ఉంద‌న్నారు.

రాజకీయాల్లో ఎత్తుపల్లాలను చూశాను..
రాజకీయాల్లో ఎత్తుపల్లాలను చూశాన‌ని లోకేశ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో భవిష్యత్తు కోసం ఎవరైనా సేఫ్ సీటు ఎంచుకుంటారు. కానీ, తాను మాత్రం 1985 తర్వాత ఎన్నడూ గెలవని మంగళగిరి నియోజకవర్గాన్నిఎంచుకున్న‌ట్లు తెలిపారు. 2014లో పోటీచేసి 5,300 ఓట్ల తేడాతో ఓటమి పాలైన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ సేవలందించాన‌ని తెలిపారు. ఫలితంగా ఇటీవల ఎన్నికల్లో త‌న‌ను అక్క‌డి ప్ర‌జ‌లు 91వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారని హ‌ర్షం వ్యక్తం చేశారు. 

గెలుపుఓటములతో సంబంధం లేకుండా నిత్యం జనంలో ఉండే నేతలనే ప్రజలు ఆదరిస్తార‌ని తెలిపారు. జాతీయస్థాయి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారా అన్న ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ... తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తార‌ని తెలిపారు. శాఖలు నిర్ణయించే సమయంలో లక్షలాది మంది భావిభారత పౌరుల భవిష్యత్తుతో ముడివడి ఉన్న విద్యాశాఖను ఎంపిక చేసుకున్న‌ట్లు చెప్పారు. సవాల్ గా తీసుకుని విద్యా వ్యవస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాన‌న్నారు. ప్ర‌స్తుత రాజకీయాలు సంక్లిష్టంగా మారాయ‌ని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే రాజకీయాల్లోకి రావాలని సూచించారు.  తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయం లాంటిద‌ని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కీలక స్థానాల్లో ఉన్న నేతల మూలాలు టీడీపీతోనే ముడివడి ఉన్నాయ‌న్నారు.

అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేస్తాం..
అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి పని చేస్తున్నామ‌ని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించిన‌ట్టు పేర్కొన్నారు. త్వరలో అక్కడ టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయ‌ని తెలిపారు. పారిశ్రామీకరణ నేపథ్యంలో వ్యవసాయరంగం దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. వ్యవసాయ పెట్టుబడులు, ఉత్పాదకతకు మధ్య పొంతన లేకపోవడంతో గిట్టుబాటు సమస్య ఏర్పడుతోంద‌ని తెలిపారు. రాయలసీమలో బంగారం పండే భూములున్నాయ‌ని పేర్కొన్నారు. 

తాను పాదయాత్ర నిర్వహించే సమయంలో మామిడి, అరటి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు పండించే రైతులు త‌న‌ను కలిసి పలు సమస్యలను తెలియజేశార‌న్నారు. అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న రకాలను సాగుచేయాల్సిందిగా తాను వారికి సూచించిన‌ట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం, మార్కెట్ ఇంటర్వెన్షన్ తో రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. 2017లో ఐటీ సర్వ్ సదస్సుకు వచ్చాన‌ని, మళ్లీ ఇదే సదస్సుకు హాజరై మిత్రులను కలవడం ఆనందంగా ఉందని మంత్రి లోకేశ్‌ చెప్పారు.



More Telugu News