డుప్లెసిస్ ఔట్.. ఆర్సీబీ సారథిగా మళ్లీ కోహ్లీనే?

  • ఆటగాళ్ల రిటెన్షన్‌కు రేపు చివరి గడువు
  • డుప్లెసిస్‌ను వదిలించుకునే యోచనలో ఆర్సీబీ
  • అదే జరిగితే కోహ్లీకి తిరిగి అప్పగించే యోచన
  • విరాట్ అంగీకరించకుంటే కేఎల్ రాహుల్‌కు పగ్గాలు?
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ గెలవకపోయినా ఆ జట్టుకు అభిమానులు మాత్రం తగ్గడం లేదు. కారణం ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కెప్టెన్సీని త్యాగం చేసి కప్పు కోసం చెమటోడుస్తున్నా టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మారింది.

ఈ నేపథ్యంలో కోహ్లీకి సంబంధించి మరో వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించేందుకు రేపే చివరి గడువు కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఏ జట్టు ఎవరిని వదులుకుంటుంది? ఎవరిని అట్టి పెట్టుకుంటాయన్న దానిపై అభిమానుల్లో చర్చ మొదలైంది. 

డుప్లెసిస్‌ను వదిలించుకునే యోచన
ఈ నేపథ్యంలోనే కోహ్లీపై ఇప్పుడు ఎడతెగని చర్చ జరుగుతోంది. కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న తర్వాత గత మూడు సీజన్లుగా జట్టును డుప్లెసిస్ నడిపిస్తున్నాడు. అయితే, ఇప్పుడు అతడిని రిటెయిన్ చేసుకునేందుకు ఆర్సీబీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగి జట్టు అతడిని వదిలేస్తే జట్టుకు కొత్త కెప్టెన్‌ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ పేరు మరోమారు తెరపైకి వచ్చింది. డుప్లెసిస్‌ను కనుక జట్టు వదులుకుంటే అతడి స్థానంలో మళ్లీ కోహ్లీకే పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు కోహ్లీ అంగీకరిస్తాడా? లేదా? అన్న దానిపైనా చర్చ జరుగుతోంది.

కోహ్లీ నో అంటే రాహుల్
ఈసారి వేలంలో కేఎల్ రాహుల్, రిషభ్‌పంత్‌ను కూడా తీసుకోవాలని యోచిస్తున్న ఆర్సీబీ.. కోహ్లీ కనుక కెప్టెన్సీ పగ్గాలు అందుకునేందుకు నిరాకరిస్తే అప్పుడు కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. అయితే, దీనిపై ఆర్సీబీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లీ 2013 నుంచి 2021 వరకు కెప్టెన్‌గా కొనసాగాడు. ఒకసారి జట్టును ఫైనల్‌కు చేర్చినా టైటిల్ మాత్రం అందించలేకపోయాడు.


More Telugu News