తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం

  • ఏకంగా 9 హోటల్స్‌కు హెచ్చరికలు
  • మంగళవారం రాత్రి 9.30గంటల నుంచి అర్ధరాత్రి వరకూ బెదిరింపు మెయిల్స్ 
  • డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో విస్తృతంగా తనిఖీలు
ప్రఖ్యాత పర్యాటక పుణ్యక్షేత్రం తిరుపతిలోని ప్రజలు, అధికారులు గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్నారు. బాంబు బెదిరింపులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం, విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం, ఎక్కడా పేలుడు పదార్ధాలు లభించకపోవడంతో ఊపిరిపీల్చుకోవడం తెలిసిందే. 

తాజాగా, తిరుపతిలో ఏకంగా తొమ్మిది హోటల్స్‌కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. నిన్న (మంగళవారం) రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ హోటల్స్‌కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇప్పటి వరకూ హోటల్స్‌లో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపు మెయిల్స్ రాగా, ఈ సారి గ్యాస్, వాటర్ పైపులైన్లు, మురుగునీటి పైపులలో పేలుడు పదార్ధాలు ఉంచామని మెయిల్స్ వచ్చాయి. తాజ్, బ్లిస్, మినర్వా, చక్రి, పాయ్, వైశ్రాయ్, రీనెస్టు, గోల్డెన్ దులిఫ్, రమీ గెస్ట్లో లైన్ హోటల్స్ కు బెదిరింపు మెయిల్స్ రావడం జరిగింది. 

సమాచారం అందుకోవడంతో డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో పోలీసులు.. డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలతో హోటల్స్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా పేలుడు పదార్ధాలు దొరకకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఫేక్ బెదిరింపులు పోలీసు యంత్రాంగానికి తలనొప్పిగా మారుతున్నాయి. ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి..? ఎవరు పంపుతున్నారు..? అనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 


More Telugu News